IPO: ప్రైమరీ మార్కెట్‌లో గత రెండు నెలల కరవుకు ముగింపుపడే సంకేతాలు అందాయి. మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో తొమ్మిది కంపెనీలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ప్రకటించబోతున్నాయి. ఈ 9 కంపెనీలు ₹17,000 కోట్లకు పైగా సమీకరించే అవకాశం ఉంది. 


కొంతకాలంగా సెకండరీ మార్కెట్‌ బలహీనంగా ఉండడంతో, పెట్టుబడుల విషయంలో పెట్టుబడిదార్లు, కంపెనీలు జాగ్రత్తగా అడుగులేస్తున్నాయి. దీంతో, డిసెంబరులో ప్రారంభమైన కొన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు సరైన ఆదరణ లేక ఇబ్బంది పడ్డాయి. ఈ కారణంగా, జనవరి & ఫిబ్రవరి నెలల్లో ఒక్క పబ్లిష్‌ ఇష్యూ కూడా రాలేదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ హై-ప్రొఫైల్ ₹20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ వచ్చినా, హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అది రద్దయింది.


రాబోయే 4-6 వారాల్లో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్న కంపెనీలు, వాటి IPO సైజ్‌లు:


అవలాన్ టెక్నాలజీస్ (Avalon Technologies) -  ₹5,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం.
క్యాపిలరీ టెక్నాలజీస్ ‍‌(Capillary Technologies) -  ₹4,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం.
కోజెంట్ సిస్టమ్స్ (Cogent Systems) -   ₹4,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం.
దివ్గీ టార్క్‌ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ (Divgi TorqTransfer Systems) -  ₹1,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం.
మ్యాన్‌కైండ్ ఫార్మా ‍‌(Mankind Pharma) -   ₹850 కోట్లు సమీకరించాలని లక్ష్యం. 
నెక్సస్ మాల్స్ REIT ‍‌(Nexus Malls REIT) -    ₹850 కోట్లు సమీకరించాలని లక్ష్యం. 
సిగ్నేచర్ గ్లోబల్ (Signature Global) -    ₹500 కోట్లు సమీకరించాలని లక్ష్యం. 
TVS సప్లై చైన్ (TVS Supply Chain) -     ₹500 కోట్లు సమీకరించాలని లక్ష్యం.
ఉత్కర్ష్ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ (Utkarsh Small Finance Bank) - ₹350 కోట్లు సమీకరించాలని లక్ష్యం.


2023 జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు (YTD), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIలు) ఇండియన్‌ మార్కెట్‌లో ₹28,104 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ50 ఇండెక్స్ 4% కంటే పైగా పడిపోయింది. ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌ క్యాప్ 150 ఇండెక్స్‌, నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 150 ఇండెక్స్‌ వరుసగా 5% & 6% క్షీణించాయి.


ప్రైమ్ డేటాబేస్ నంబర్‌ల ప్రకారం... గత ఎనిమిది నెలల్లో 33 కంపెనీలు తమ IPO అనుమతులు రద్దు చేసుకున్నాయి. ఈ 33 కంపెనీలు ₹49,300 కోట్ల విలువైన IPOల కోసం గతంలో ప్లాన్‌ చేశాయి. ఇవి, తమ IPO అనుమతులను రద్దు చేసుకోవడానికి మార్కెట్‌ పరిస్థితులు బాగా లేకపోవడం ప్రధాన కారణం అయితే, కొన్ని సంస్థలకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. 


ఆటోమోటివ్ కాంపోనెంట్ సంస్థ Divgi Torq Transfer Systems, 2023లో, మెయిన్‌బోర్డ్ తొలి పబ్లిక్ ఇష్యూని ప్రారంభించనున్న మొదటి కంపెనీ. ఈ IPO మార్చి 1న ప్రారంభమై, మార్చి 3న ముగుస్తుంది. ₹500 కోట్ల IPOలో... ₹180 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో 3.93 మిలియన్ షేర్లను ఆఫ్‌లోడ్‌ చేస్తారు. 


మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌లు, ప్రీగా న్యూస్‌లకు పేరుగాంచిన డ్రగ్ మేకర్ మ్యాన్‌కైండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో మార్కెట్‌లోకి రావచ్చటు, ₹5,000 కోట్ల వరకు సమీకరించవచ్చు. 


TVS గ్రూపులో భాగమైన టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్, రాబోయే 5-6 వారాల్లో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించేందుకు యోచిస్తోంది. ₹4,000 కోట్ల IPO సమీకరణలో, ₹2,000 కోట్ల విలువైన షేర్ల ఫ్రెష్ ఇష్యూతో పాటు, 59.5 మిలియన్ షేర్లు ఆఫర్ ఫర్ సేల్‌లో ఉంటాయి.


ప్రైమ్ డేటాబేస్ ప్రకారం... IPOల ద్వారా, 2021లో 63 కంపెనీలు ₹1.19 లక్షల కోట్లు సేకరిస్తే, 2022లో 40 కంపెనీలు ₹59,302 కోట్లను సేకరించాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.