Joyalukkas IPO: భారతీయ ఆభరణాల కంపెనీ జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ (Joyalukkas India Ltd) తన ఇనీషియల్‌ పబ్లిష్‌ ఆఫర్‌ (IPO) ప్రతిపాదనను రద్దు చేసుకుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ మార్కెట్ నుంచి నిధులను సేకరించేందుకు ఈ కంపెనీ గత ఏడాది ప్లాన్‌ చేసింది. సెబీకి డ్రాఫ్ట్ పేపర్ (DRHP) కూడా గత ఏడాదిలో దాఖలు చేసింది. అయితే, ఇప్పుడు ఈ డ్రాఫ్ట్‌ పేపర్‌ను ఉపసంహరించుకుంది.


జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్, IPOకు వెళ్లకూడాదని నిర్ణయించుకుదని, ఉపసంహరణ కోసం సెబీకి సమాచారం ఇచ్చిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వెబ్‌సైట్‌లో ఈ అప్‌డేట్‌ కనిపించిందని వెల్లడించింది. ఏ కారణం వల్ల ఐపీవో ప్రతిపాదనను రద్దు చేసుకుందో ఆ వెబ్‌సైట్‌లో పేర్కొనలేదని రాయిటర్స్ తెలిపింది. 


ఈ విషయంపై జోయాలుక్కాస్‌కు జాతీయ మీడియా ఈ-మెయిల్‌ పంపినా, ఆ సంస్థ స్పందించలేదని తెలుస్తోంది. 


ప్రతిపాదిత ఐపీఓ ద్వారా రూ. 2,300 కోట్లు ‍‌(277.95 మిలియన్‌ డాలర్లు) సమీకరించాలని కంపెనీ భావించింది. 2023 ప్రారంభంలో IPO తేదీలు, ఇతర వివరాలు వెల్లడవుతాయని మార్కెట్‌ ఎదురు చూసింది.


జోయాలుక్కాస్ ప్లాన్స్‌ బాగానే ఉన్నాయి
ఆభరణాల కంపెనీ 2022 మార్చిలో డ్రాఫ్ట్ పేపర్‌ను సెబీకి సమర్పించింది. ప్రైమరీ మార్కెట్‌ నుంచి సమీకరించే రూ. 2,300 కోట్ల నుంచి రూ. 1400 కోట్ల మొత్తాన్ని కొన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి, & కొత్త జ్యువెలరీ స్టోర్లను తెరవడానికి ఉపయోగిస్తామని DRHP తెలిపింది. 


ఈ IPO కోసం ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (Edelweiss Financial Services Ltd), హైటాంగ్ సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ (Haitong Securities India Pvt Ltd), మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ ‍‌(Motilal Oswal Investment Advisors Ltd), ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ను (SBI Capital Markets Ltd) లీడ్ మేనేజర్‌లుగా జోయాలుక్కాస్ నియమించింది. ప్రతిపాదిత ఐపీఓ రద్దుపై ఇవి కూడా స్పందించలేదు.


ఈ కేరళకు చెందిన ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ దేశవ్యాప్తంగా దాదాపు 68 నగరాల్లో షోరూమ్‌లు నిర్వహిస్తోంది. దేశంలోని అతి పెద్ద ఆభరణాల రిటైలర్‌లలో ఇది కూడా ఒకటి.


మొదటిసారిగా, 2018లో IPO ప్రణాళికను ప్రకటించింది జోయాలుక్కాస్. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పుడు IPOకు రాలేకపోయింది. ఆ తరువాత, గత సంవత్సరం తాజాగా IPO డ్రాఫ్ట్‌ పేపర్లను దాఖలు చేసింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్, IPO మార్కెట్‌ రెండూ ఒడుదొడుకులకు లోనుకావడం వల్ల సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఆ ఏడాదంతా స్టాక్‌ మార్కెట్‌ పతనం కావడంతో చాలా కంపెనీలు తమ ప్రతిపాదిత IPOను వాయిదా వేసుకున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.