Global Surfaces IPO: గ్లోబల్ సర్ఫేసెస్‌ IPO (Initial Public Offering) వచ్చే వారం ప్రారంభం కాబోతోంది. మార్కెట్‌ అనిశ్చితి భయంతో కొన్ని కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌ నిర్ణయాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో, గ్లోబల్‌ సర్ఫేసెస్‌ చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది.


గ్లోబల్ సర్ఫేసెస్‌ IPO 13 మార్చి 2023న ప్రారంభం అవుతుంది. పెట్టుబడిదార్లు బిడ్స్‌ వేయడానికి మార్చి 15 వరకు ఓపెన్‌లో ఉంటుంది. IPO ప్రైస్‌ బ్యాండ్‌ను కూడా కంపెనీ నిర్ణయించింది.


గ్లోబల్ సర్ఫేసెస్‌ ఐపీవో ప్రైస్‌ బ్యాండ్‌
పబ్లిక్‌ ఆఫర్‌లో, ఒక్కో షేరును రూ.133 నుంచి 140 మధ్య ‍‌(Global Surfaces IPO Price Band) కంపెనీ కేటాయిస్తుంది. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ (రూ. 140) ప్రకారం, ఐపీఓ ద్వారా రూ. 155 కోట్లు సమీకరించేందుకు గ్లోబల్ సర్ఫేసెస్ సిద్ధమవుతోంది. 


IPOలో 100 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. అంటే, పెట్టుబడిదారులు కనీసం 100 షేర్ల కోసం బిడ్‌ వేయాలి. ఆ తర్వాత 100 గుణిజాల (100, 200, 300, 400...) ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. 


గ్లోబల్ సర్ఫేసెస్‌ ఐపీవో ‌లిస్టింగ్‌ తేదీ
రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE & NSE) మార్చి 23, 2023న గ్లోబల్ సర్ఫేసెస్‌ షేర్లు లిస్ట్ (‌Global Surfaces Shares Listing Date) అవుతాయని భావిస్తున్నారు.


ఐపీవో ద్వారా 85.20 లక్షల షేర్లను ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా జారీ చేస్తున్నారు. 25.5 లక్షల షేర్లను ప్రమోటర్లు మయాంక్ షా, శ్వేతా షా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తున్నారు.


రిటైల్‌ ఇన్వెస్టర్లకు భారీ అవకాశం
ఈ IPOలో, అర్హత గల సంస్థాగత పెట్టుబడిదార్లకు (qualified institutional buyers - QIBs) 50 శాతం కోటా రిజర్వ్ చేశారు. సంస్థాగతేతర పెట్టుబడిదార్లకు (non-institutional investors) 15 శాతం, చిన్న పెట్టుబడిదార్లకు (retail investors) 35 శాతం వాటాను ఖరారు చేశారు. ఐపీవోల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం సాధారణంగా 15 శాతం పోర్షన్‌ మాత్రమే కేటాయిస్తారు, ఈ ఐపీవోలో అంతకుమించి అవకాశం ఇచ్చారు. 


IPO ద్వారా సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని దుబాయ్‌లో తయారీ ఫ్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు తన అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ సర్ఫేసెస్ FZEలో పెట్టుబడిగా పెట్టనుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకుంటుంది. 


2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ సర్ఫేసెస్‌ ఆదాయం రూ. 198 కోట్లు. దీనిపై రూ. 35 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది.


మార్కెట్‌ అనిశ్చితి కారణంగా... వైద్య పరికరాల తయారీ సంస్థ ఐరోక్స్ టెక్నాలజీస్ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. దీనికంటే ముందు, ఫ్యాబ్‌ఇండియా, జోయాలుక్కాస్ ఇండియా కూడా తమ IPO ప్రతిపాదన రద్దు చేసుకున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.