Airox Technologies IPO: భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా, దలాల్‌ స్ట్రీట్‌లోకి అడుగు పెట్టకుండానే మరో కంపెనీ వెనక్కు వెళ్లిపోయింది. వైద్య పరికరాల తయారీ సంస్థ ఎయిరోక్స్‌ టెక్నాలజీస్ (Airox Technologies) తన ఐపీవో ప్రణాళికను రద్దు చేసుకుంది. IPO (Initial Public Offering) ద్వారా రూ. 750 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ భావించింది.     

  


ఎయిరోక్స్‌ టెక్నాలజీస్, తన ప్రతిపాదిత IPO కోసం సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) 30 సెప్టెంబర్ 2022న డ్రాఫ్ట్‌ పేపర్‌ దాఖలు చేసింది.          


ఎయిరోక్స్‌ టెక్నాలజీస్ కంపెనీ ప్రమోటర్లు భరత్‌కుమార్ జైస్వాల్, అషిమా సంజయ్ జైస్వాల్ తమ వాటాల్లో కొంత భాగాన్ని ఈ IPO ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో విక్రయించాలని భావించారు.     


IPO రద్దుపై వెల్లడికాని కారణాలు     
SEBI వెబ్‌సైట్‌లో చూసిన అప్‌డేట్ ప్రకారం... IPOని తీసుకురావడానికి దాఖలు చేసిన డ్రాఫ్ట్ ఆఫర్ పత్రాలు గత నెలాఖరులో, అంటే ఫిబ్రవరి 28, 2023న ఎయిరోక్స్‌ టెక్నాలజీస్ ఉపసంహరించుకుంది. అయితే ఐపీఓ ఉపసంహరణ వెనకున్న కారణాలను మాత్రం ఈ కంపెనీ వెల్లడించలేదు.             


ఔరంగాబాద్‌ కేంద్రంగా పని చేసే ఎయిరోక్స్‌‌ టెక్నాలజీస్, PSA ఆక్సిజన్ జనరేటర్ల (PSA Oxygen Generator) తయారీ సంస్థ. 2022 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి, PSA మెడికల్ ఆక్సిజన్ మార్కెట్‌లో ఈ కంపెనీకి 50 నుంచి 55 శాతం వాటా ఉంది.     


2022 మార్చి చివరి నాటికి, 872 PSA ఆక్సిజన్ జనరేటర్లను ఏర్పాటు చేసి, ఆక్సిజన్‌ తయారీని ఈ కంపెనీ ప్రారంభించింది. PSA ఆక్సిజన్ జనరేటర్లు, గాలిలోని నైట్రోజన్ వాయువును తొలగించడం ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ యంత్రాలు తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ అందించడంలో సహాయపడతాయి.           


అంతకుముందు రెండు కంపెనీలు       
ఇంతకుముందు, దుస్తుల రిటైల్ కంపెనీ ఫ్యాబ్‌ ఇండియా ‍‌(Fabindia) కూడా తన IPO ప్రతిపాదనను కోల్డ్ స్టోరేజీలోకి నెట్టేసింది. జ్యువెలరీ కంపెనీ జోయాలుక్కాస్ ‍‌(Joyalukkas) కూడా తన IPO ప్లాన్‌ను రద్దు చేసుకుంది. IPO ద్వారా 482.43 మిలియన్ డాలర్లు లేదా రూ. 4000 కోట్లు సమీకరించాలని ఫ్యాబ్‌ఇండియా గతంలో నిర్ణయించింది. జోయాలుక్కాస్ ఇండియా ఐపీఓ ద్వారా రూ. 2,300 కోట్లు సమీకరించాలని భావించింది.       


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.