Elin Electronics IPO Listing: ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇవాళ (30 డిసెంబర్‌ 2022) చివరి ట్రేడింగ్ రోజు. ఇవాళ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసిన ఎలిన్ ఎలక్ట్రానిక్స్ IPOదే ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో చివరి లిస్టింగ్‌. మార్కెట్‌ మూడ్‌ బాగోలేకపోవడంతో, ఈ చివరి రోజుల్లో వచ్చిన IPOలన్నీ పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచాయి. 


మార్కెట్‌ ఇవాళ సానుకూలంగా ప్రారంభం కాకపోయినా, ప్రతికూల పరిస్థితులు లేవు కాబట్టి, ఈ చివరి లిస్టింగ్‌ అయినా సంతోషాన్ని నింపుతుందని భావించారు. కానీ, ఆ ఆశల మీద ఎలిన్ ఎలక్ట్రానిక్స్ కూడా నీళ్లు చల్లింది. 


ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎలిన్ ఎలక్ట్రానిక్స్ స్టాక్‌, IPO ధర (రూ. 247) కంటే తక్కువ ధరలో స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. 


బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, BSEలో ఒక్కో షేరు రూ. 243 వద్ద.. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో రూ. 244 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో షేరు దాదాపు 3 శాతం క్షీణతతో రూ. 239 వద్ద ట్రేడ్ అవుతోంది.




ఊహించిన దాని కంటే తక్కువ స్పందన
ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ IPO (Initial Public Offering) కేవలం 3.09 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. చాలా బ్రోకరేజ్‌ కంపెనీలు ఈ IPO గురించి బుల్లిష్‌గా ఉన్నా, ఊహించిన దాని కంటే తక్కువ స్పందన అందుకుంది. 


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం... ఈ కంపెనీ IPO ద్వారా 1,42,09,386 షేర్లను అమ్మకానికి తీసుకొస్తే, మొత్తం 4,39,67,400 షేర్ల కోసం బిడ్స్‌ వచ్చాయి. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల రిజర్వ్ కోటా 4.51 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 3.29 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసిన కోటా 2.20 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. 


ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ IPO 2022 డిసెంబర్ 20-22 తేదీల మధ్య కొనసాగింది. రూ. 175 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద రూ. 300 కోట్ల విలువైన షేర్లను కంపెనీ విడుదల చేసింది. రూ. 234-247 ప్రైస్‌ బ్యాండ్‌లో, మొత్తం రూ. 475 కోట్లను సమీకరించింది. ఈ నిధుల్లో కొంత భాగాన్ని రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోనుంది. 


లైట్లు, ఫ్యాన్లు, వంటగది వస్తువులను తయారు చేసే చాలా ఫేమస్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్ల కోసం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్లను అందిస్తోంది. ఈ కంపెనీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌, గోవాలోని వెర్నాలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి.


కంపెనీకి ఉన్న మెరుగైన ఆర్థిక ఫలితాలు, మంచి వ్యాపార నమూనా, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ కారణంగా, చాలా బ్రోకరేజ్ కంపెనీలు ఈ IPOలో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడిదారులకు సలహా ఇచ్చాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.