KFin Technologies IPO Listing: స్టాక్‌ మార్కెట్‌లోని బ్యాడ్‌ సెంటిమెంట్ మరో IPO లిస్టింగ్‌ను ముంచేసింది. ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్ కంపెనీ అయిన కేఫిన్ టెక్నాలజీస్, ఇవాళ (గురువారం, 29 డిసెంబర్‌ 2022) స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. అయితే.. మార్కెట్‌ మూడ్‌ బాగోలేకపోవడంతో, లిస్టింగ్ నిరాశపరిచింది. కంపెనీ IPO ఇష్యూ ప్రైస్‌ రూ. 366 అయితే... నామమాత్రంగా 0.27 శాతం ప్రీమియంతో షేర్లు ట్రేడింగ్ ప్రారంభించాయి. అనువుగాని సమయంలో వచ్చి జావగారిపోయాయి.

బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, BSEలో రూ. 369 వద్ద - నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌, NSEలో రూ. 367 వద్ద షేర్లు దలాల్‌ స్ట్రీట్‌ అరంగేట్రం చేశాయి. బలహీన మార్కెట్‌ పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి పతనమయ్యాయి. ఈ కథనం రాసే సమయానికి ఈ షేరు 3.44 శాతం క్షీణించి రూ. 352.60 వద్ద ట్రేడవుతోంది. 

IPO లిస్టింగ్ తర్వాత, KFin టెక్నాలజీస్ మార్కెట్ విలువ రూ. 5906 కోట్లుగా ఉంది. 

2022 డిసెంబర్ 19న ప్రారంభమైన IPO సబ్‌స్క్రిప్షన్‌, డిసెంబర్ 21న ముగిసింది. ఈ IPO కేవలం 2.59 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో... సంస్థాగత పెట్టుబడిదారుల కోటా 4.17 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.23 రెట్లు స్పందన అందుకుంటే... నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కోటా 23 శాతం మాత్రమే పూర్తయింది. 

రూ.10 ముఖ విలువతో షేర్లను జారీ చేసిన కేఫిన్ టెక్నాలజీస్, ఈ IPO ద్వారా రూ. 1500 కోట్లను సమీకరించింది. IPO సమయంలో రూ. 347-366 రేంజ్‌లో మధ్య ఒక్కో షేరును విక్రయానికి పెట్టింది.

ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూట్‌లో వచ్చింది. దాదాపు 4.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్లు IPO ద్వారా అమ్మేశారు. ఇష్యూ మొత్తం OFS కావడం కూడా ఇన్వెస్టర్లలో పెద్దగా ఆసక్తి లేకపోవడానికి కారణమైంది.

ఈ IPOలు కూడా బాధితులేగత వారం కూడా, ల్యాండ్‌మార్క్ కార్స్‌ IPO స్టాక్ మార్కెట్‌లో భారీ పతనాన్ని భరించవలసి వచ్చింది. రూ. 506 ఇష్యూ ధర ఉన్న ఈ స్క్రిప్‌, లిస్టింగ్ తర్వాత జారిపోయింది & ఇప్పటివరకు ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయింది. ప్రస్తుతం ల్యాండ్ మార్క్ కార్స్ షేర్ రూ. 452 వద్ద ట్రేడవుతోంది. అబాన్స్ హోల్డింగ్స్ IPO లిస్టింగ్ కూడా బాగా నిరాశపరిచింది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 270 ధర వద్ద IPOను ప్రకటించింది. ఇప్పుడు ఆ కౌంటర్‌ రూ. 195 వద్ద ట్రేడవుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.