ఈ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ సప్లయర్‌ కంపెనీ డెల్హీవరీ ఐపీవోకు వస్తోంది. ధరల వివరాలను ప్రకటించింది. ఇష్యూ విలువ రూ.5235 కోట్లుగా ఉంది. ధరల శ్రేణి రూ.462-497గా నిర్ణయించింది. ఐపీవో మే 11న మొదలై 13న ముగుస్తుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ ప్రాసెస్‌ మే 10 మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది.


మొదట రూ.7,460 కోట్ల విలువతో డెల్హీవరీ ఐపీవోకు రావాలని మొదట అనుకుంది. పరిస్థితుల దృష్ట్యా వాల్యూయేషన్‌ను తగ్గించింది. రూ.5,235 కోట్ల విలువతో వస్తోంది. ప్రెష్‌ ఇష్యూ కింద రూ.4000 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.1235 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది.


డెల్హీవరీలో కార్లైల్‌ గ్రూప్‌, సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు సహ వ్యవస్థాపకుల వాటాలను ఉపసంహరిస్తున్నారు. కార్లైల్‌ గ్రూపునకు చెందిన సీఏ స్విఫ్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.454 కోట్ల విలువైన షేర్లను డైల్యూట్‌ చేయనుంది. సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ డోర్‌బెల్‌ రూ.365 కోట్ల వాటాను విక్రయిస్తోంది. చైనా మూమెంటమ్‌ ఫండ్‌కు చెందిన డెలీ సీఎంఎఫ్‌ రూ.200 కోట్ల షేర్లను అమ్మేస్తోంది. టైమ్స్ ఇంటర్నెట్‌ రూ.165 కోట్ల షేర్లను విక్రయిస్తోంది.


కంపెనీ వ్యవస్థాపకులు కపిల్‌, భారతీ, మోహిత్‌ టాండన్‌, సూరజ్‌ సహరన్‌ వరుసగా రూ.5 కోట్లు, రూ.40 కోట్లు, రూ.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూలో 75 శాతం వరకు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. డెల్హీవరీ ఇష్యూకు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్స్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా లీడ్‌ మేనేజర్లుగా ఉన్నారు. డెల్హీవరీ దేశవ్యాప్తంగా 17,045 పోస్టల్‌ కోడ్స్‌లో సేవలు అందిస్తోంది.