Aakash IPO: 


బైజూస్‌ ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ వచ్చే ఏడాది ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు రానుంది. ఇందుకు బైజూస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. వాస్తవంగా 2023లోనే ఐపీవోకు రావాలని ప్లాన్‌ చేయగా.. కొన్ని కారణాలతో వచ్చే ఏడాదికి మార్చారు.


ప్రస్తుతం ఆకాశ్‌ రెవెన్యూ రూ.4000 కోట్లకు చేరుకుంది. 2023-24కు ఎబిటా విలువ రూ.900 కోట్లుగా ఉందని బైజూస్‌ వెల్లడించింది. 'ఆకాశ్ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్ లిమిటెడ్‌ ఐపీవోను వచ్చే ఏడాది మధ్యలో తీసుకురానున్నాం. ఐపీవోకు సంబంధించిన మర్చంట్‌ బ్యాంకర్లను అతి త్వరలోనే ప్రకటిస్తాం. వచ్చే ఏడాది విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూకు వస్తాం' అని బైజూస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.


'ఆకాశ్ మౌలిక సదుపాయాల విస్తరణ, రీచ్‌ను పెంచడం, అత్యధిక నాణ్యతతో కూడిన పరీక్షా సన్నద్ధత విద్యను దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందించేందుకు ఐపీవో ద్వారా వచ్చే మూలధనాన్ని వినియోగిస్తాం' అని బైజూస్‌ వివరించింది. ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ను 2021 ఏప్రిల్‌లో రూ.7,100 కోట్లతో బైజూస్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. విలీనం జరిగినప్పటి నుంచి ఆకాశ్‌ ఆదాయం రెండేళ్లలోనే మూడు రెట్లు పెరిగింది.


2020-25లో టెస్టు ప్రిపరేషన్‌ మార్కెట్‌ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 9.3 శాతం వృద్ధిరేటుతో పెరుగుతుందని కెన్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. ఇక ఆన్‌లైన్‌ టెస్టు ప్రిపరేషన్‌ సెగ్మెంట్‌ వార్షికంగా 42.3 శాతం వృద్ధి సాధిస్తుందని వెల్లడించింది. 'ఇంజినీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ కోసం ఆకాశ్‌ అత్యుత్తమమైన క్లాస్‌రూమ్‌ బోధన, డిజిటల్‌ ప్రొడక్ట్స్‌, సర్వీసెస్‌ ప్రొడక్టులను ఆఫర్‌ చేస్తోంది. ఈ విభాగంలో దేశంలోనే అత్యుత్తమంగా నిలిచింది' అని పేర్కొంది. ప్రస్తుతం ఆకాశ్‌కు దేశవ్యాప్తంగా 325 టెస్టు సెంటర్లు, 4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.


అప్పుల బాధలో బైజూస్‌!


ఇదిలా ఉండగా బైజూస్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. జూన్‌ 5న ఏకంగా రూ.329 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వడ్డీ చెల్లింపులో విఫలమైతే అప్పు ఎగ్గొట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే సోమవారమూ ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడం కష్టమేనని ఇంటర్నల్‌ సోర్సెస్‌ ద్వారా తెలిసింది.


ప్రస్తుతం బైజూస్‌ నెత్తిన 1.2 బిలియన్‌ డాలర్ల (రూ.9892 కోట్లు) మేర అప్పు ఉంది. జూన్‌ 5న చెల్లించాల్సిన వడ్డీపై మాట్లాడాల్సిందిగా కోరగా కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. అప్పుల చెల్లింపుపై నియమించుకున్న సలహదారు కంపెనీ హులిహన్ లోకీ సైతం మీడియాకు అందుబాటులో లేదు.


చరిత్రలో ఒక స్టార్టప్‌ కంపెనీకి ఎలాంటి రేటింగ్‌ లేని అతిపెద్ద అప్పు ఇదే! ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు బైజూస్‌ రవీంద్రన్‌ చాలా శ్రమిస్తున్నారని తెలిసింది. లోన్‌ రీ స్ట్రక్చరింగ్‌ కోసం రుణదాతలతో సుదీర్ఘ కాలంగా సంప్రదింపులు జరుపుతున్నారు. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ విద్యపై ఆసక్తి తగ్గిపోవడంతో ఆశించిన మేరకు రాబడి లేదు. దాంతో తమ డబ్బుల్ని వెంటనే చెల్లించాల్సిందిగా రుణదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. పైగా వీరంతా ఒక సహకార ఒప్పందం చేసుకొని కన్సార్టియంగా ఏర్పడ్డారు.