Indian Stock Market: అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రపంచంలోనే పెద్ద ఈక్విటీ మార్కెట్లు. ఈ దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, వాతావరణ మార్పులు, స్టాక్ మార్కెట్లలో వచ్చే ఒడిదొడుకులు మిగిలిన ప్రపంచ దేశాల మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తాయి. అయితే, రిటర్న్స్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు బిగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న ఇండియన్ మార్కెట్ కంటే వెనుకబడ్డాయి.
గత 123 ఏళ్లలో, భారత స్టాక్ మార్కెట్ మొత్తం 6.6 శాతం రాబడిని ఇచ్చింది. ఇది అమెరికా, చైనా మార్కెట్ల రాబడుల కంటే ఎక్కువ. కేవలం ఇవి రెండే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల స్టాక్ మార్కెట్లు ఇచ్చిన లాభాల ఇండియన్ మార్కెటే ముందుంది. 'ఎర్లీ సిగ్నల్స్ త్రూ చార్ట్స్' (Early Signals Through Charts) పేరిట DSP అసెట్ మేనేజర్స్ కంపెనీ రిలీజ్ చేసిన 'నేత్ర జూన్ 2023' (Netra June 2023) రిపోర్ట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.
ఎక్కువ సంపాదించిన భారతీయ పెట్టుబడిదార్లు
ఈ 123 ఏళ్లలో, భారతదేశంలోని మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్ల సంపద 6.6 శాతం చక్రవడ్డీ రేటుతో (CAGR) పెరిగినట్లు తన నివేదికలో DSP అసెట్ మేనేజర్స్ వెల్లడించింది. దీంతో పోల్చి చూస్తే, US పెట్టుబడిదార్ల సంపద 6.4 శాతం CAGR వద్ద పెరిగింది. డ్రాగన్ కంట్రీ ఇన్వెస్టర్లు 3.3 శాతం CAGR వద్ద రాబడి పొందారు. 1900 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 123 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలు ఇవి.
DSP అసెట్ మేనేజర్స్ రిపోర్ట్ ప్రకారం, CAGRను ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణతకు సర్దుబాటు చేసిన తర్వాత కూడా మన దేశంలోని పెట్టుబడిదార్లు మంచి ఆదాయం సంపాదించగలిగారు.
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ భేష్
ప్రపంచ మార్కెట్లు ఇచ్చిన ప్రి-కాస్ట్ & ప్రి-టాక్స్ రియల్ రిటర్న్స్, CAGR ప్రాతిపదికన, 5 శాతంగా ఉన్నాయని నివేదికలోని డేటా సూచిస్తోంది. ఇండియన్ మార్కెట్ ఇచ్చిన రాబడి దీని కంటే చాలా ముందుంది. ఇది శతాబ్దపు అత్యుత్తమ రాబడి. 1900 నుంచి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు (emerging markets) మొత్తం 3.8 శాతం CAGR రాబడిని ఇచ్చాయని కూడా DSP నివేదిక పేర్కొంది.
వెంటబడుతున్న విదేశీ పెట్టుబడిదార్లు
భారతీయ స్టాక్ మార్కెట్‌పై విదేశీ పెట్టుబడిదార్ల విశ్వాసం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దేశంలోకి FPIలు తీసుకొస్తున్న డాలర్ లెక్కలే దీనికి రుజువు. 2023 జూన్ 1-9 తేదీల్లో ఇప్పటి వరకు, 9800 కోట్ల రూపాయలను ఎఫ్‌పీఐలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. గత కొన్ని నెలలుగా వాళ్లు నెట్ బయ్యర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: పసిడి ధర ₹2,500 పతనం, గోల్డ్ కొనే టైమ్ వచ్చిందా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.