Indian Economy: జయహో భారత్! అనాల్సిన తరుణం వచ్చేసింది! 200 ఏళ్లు బానిసలుగా పరిపాలించిన బ్రిటన్‌ను స్వత్రంత్ర భారతదేశం తొలిసారి వెనక్కి నెట్టేసింది. భూమ్మీద ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఆంగ్లేయులను ఆరో స్థానానికి పరిమితం చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ ఓ నివేదిక విడుదల చేసింది.
వరుసగా 3 నెలలు
2021 ఆర్థిక ఏడాదిలో వరుసగా చివరి మూడు నెలలు బ్రిటన్‌ను భారత్ అధిగమించింది. ఐదో అతిపెద్ద ఎకానమీగా రికార్డు సృష్టించింది. అమెరికా డాలర్ల ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను లెక్కించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ జీడీపీ గణాంకాల పరంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి క్వార్టర్లోనూ భారత్ ముందంజలో ఉంది.
బ్రిటన్‌లో దారుణ పరిస్థితులు
ప్రస్తుతం బ్రిటన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దేశం ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, ప్రజల జీవన స్థాయి పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా తర్వాత బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రూస్, మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి రిషి సనక్ ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. బ్రిటన్‌ను పాలించే అవకాశం భారతీయుడికి ఇవ్వొద్దన్న ఉద్దేశంతో బ్రిటిష్ జాతికి చెందిన వారికే జాన్సన్ మద్దతిస్తాననడం తెలిసిందే.
ఇండియా @ 854 బిలియన్ డాలర్లు
బ్రిటన్‌లో ఎవరు ప్రధానమంత్రిగా వచ్చినా వారికి సమస్యలే స్వాగతం పలకనున్నాయి. ఇక మరోవైపు భారత ఎకానమీ ఈ ఏడాది 7 శాతం వృద్ధిరేటుతో పరుగులు పెట్టనుంది. ఈ మధ్యే భారత స్టాక్ మార్కెట్లు విపరీతంగా లాభపడ్డాయి. ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. సవరించిన డాలర్ మార్పిడి రేటు ప్రకారం సంబంధిత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ నామినల్ నగదు విధానంలో మార్చి నాటికి 854.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్రిటన్ 816 బిలియన్ డాలర్లతో వెనకబడింది.
జీడీపీ 7 vs 1
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే అవకాశం ఉంది. రెండో త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ కేవలం 1 శాతం వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణంతో అడ్జస్ట్ చేస్తే 0.1 శాతానికి కుంచించుకుపోతోంది. డాలర్, రూపాయితో పోలిస్తే పౌండ్ విలువ మరింత పడిపోతోంది. ఈ ఏడాది రూపాయితో పోలిస్తే 8 శాతం పతనమైంది. ఐఎంఎఫ్ అంచనాల మేరకు వార్షిక ప్రాతిపదికన భారత్ ఇలాగే రాణిస్తే అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత పవర్ హౌజ్‌గా మారుతుంది. కాగా దశాబ్దం క్రితం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ ఐదో స్థానంలో ఉంటే భారత్ 11వ ప్లేస్‌లో ఉండటం గమనార్హం.
జీడీపీ పరుగు
India Q1 GDP: భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ సూపర్ ఫాస్ట్ వేగం అందుకుంది. ఈ ఏడాదిలో ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, కమోడిటీ ధరలు తగ్గడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగవ్వడంతో దేశ జీడీపీ భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ రెండంకెల వృద్ధిరేటు 13.5 శాతం నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాయిటర్స్, ఇతర సంస్థలు అంచనా వేసిన 15.2 శాతం కన్నా కొద్దిగా తగ్గింది. అయితే చివరి త్రైమాసికంలోని 4.1% వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగైంది.
జీడీపీ వసూళ్ల రికార్డు
GST Collection August: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లలో దేశం రికార్డులు సృష్టిస్తోంది! వరుసగా ఆరో నెల జీఎస్‌టీ రాబడి రూ.1.4 లక్షల కోట్లు దాటేసింది. వార్షిక ప్రతిపాదికన ఆగస్టులో జీఎస్టీ రాబడి 28 శాతం వృద్ధి చెంది రూ.1,43,612 కోట్లుగా నమోదైంది.
ఇందులో సీజీఎస్‌టీ రూ.24,710 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.30,951 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.77,782 కోట్లుగా ఉన్నాయి. ఐజీఎస్‌టీలోనే దిగుమతులపై వేసిన పన్ను రూ.42,067 కోట్లు కావడం గమనార్హం. ఇక సెస్ రూపంలో రూ.10,168 కోట్లు (దిగుమతులపై రూ.1018 కోట్లు) వచ్చాయి. గతేడాది ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,12,020 కోట్లు కాగా ఈ సారి 28 శాతం ఎక్కువ రాబడి వచ్చింది.