వేరుశెనగ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. చల్లటి వాతావరణంలో వేయించిన వేరుశెనగను బెల్లంతో కలిపి తింటుంటే సూపర్ ఉంటుంది. రుచికరంగా ఉంటాయి కనుక చిన్న పిల్లలు కూడా వాటిని తినేందుకు ఎంతో ఇష్టపడతారు. ఎన్నో పోషకాలు నిండిన వేరుశెనగతో చేసిన చిక్కీలు, ముద్దలు చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన చిరుతిండి. దోశ, ఇడ్లీ వంటి టిఫిన్స్ లో వేరుశెనగ పప్పులతో చేసిన చెట్నీ అద్భుతమైన కాంబినేషన్. ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు.
రక్త హీనత సమస్య మహిళలు, పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. త్వరగా నీరసంగా మారడానికి అదే కారణం. ఆ ఆరోగ్య సమస్య నుంచి త్వరగా తేరుకోవాలంటే రోజుకో అరముక్క పల్లీ పట్టి తింటే చాలా మేలు. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తీరిపోతుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల కొంత శక్తి లభిస్తుంది. శక్తిహీనంగా, నీరసంగా అనిపించదు. శరీరం కాస్త చురుకుగా మారుతుంది.
ప్రోటీన్లు, కొవ్వు, ఫైబర్ తో పాటు అనేక ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉన్న వేరుశెనగ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. ఈ గింజలు తక్కువ-గ్లైసెమిక్ ఆహార జాబితాలో ఉన్నాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. వేరుశెనగలు మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. వేరుశెనగ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానిక్ హాని కలిగే అవకాశం కూడా ఉంది.
అలర్జీని కలిగిస్తుంది: అలర్జీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వేరుశెనగ తీసుకోవడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి తినడం వల్ల చర్మం పగిలినట్టుగా మారడం, శ్వాస ఆడకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, ముక్కు కారడం వంటివి ఉండొచ్చు.
జీర్ణ సమస్యలు: వేరుశెనగ కొన్నిసార్లు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, విరేచనాలు, ఉబ్బరం, గ్యాస్‌గా అనిపించడం వంటివి అతిగా వేరుశెనగ తినడం వల్ల వచ్చే ప్రమాదం ఉంది.
బరువు పెరగొచ్చు: పోషకాహార నిపుణులు ఎక్కువగా బరువు తగ్గడానికి వేరుశెనగ తినాలని సిఫార్సు చేస్తారు. అయితే అతిగా వాటిని తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. కొన్ని వేరుశెనగలు 170 కేలరీలను కలిగి ఉంటాయి. ఇవి స్నాక్స్ గా తినడానికి సరిపోతాయి. కానీ అంతకంటే ఎక్కువ బరువును అదుపులో ఉంచుకోవడానికి హానికరమని కొందరు నిపుణులు అభిప్రాయం.
పోషకాహార లోపం రావచ్చు: వేరుశెనగలు ఫాస్పరస్, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇవి ఫైటిక్ యాసిడ్ లేదా ఫైటేట్ రూపంలో నిల్వ చేయబడతాయి. చాలా ఎక్కువ ఫైటేట్ ఐరన్, జింక్ వంటి అనేక ఇతర ఖనిజాల శోషణను నిలిపివేస్తుంది. దీని వల్ల దీర్ఘకాలంలో పోషకాహార లోపానికి దారితీస్తుంది.
కాలేయంపై ప్రభావం: వేరుశెనగలు అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి విషపూరితం. తేమతో కూడిన వాతావరణంలో సాధారణంగా కనిపించే అఫ్లాటాక్సిన్‌తో ఇవి బాగా కలిసిపోతాయి. దాని ప్రభావం కాలేయంపై చూపుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: జుట్టు చివర్లు చిట్లిపోయి ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అద్భుత ఫలితం
Also Read: పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, మీరు కూడా ట్రై చేయండి