పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు వింటేనే పూనకాలు వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఎంతో మందికి ఆయన అంటే వెలకట్టలేని అభిమానం. అది ఎంత అంటే ఏటా కొంతమంది అభిమానులు పవన్ మాల పేరిట దీక్ష ధరించేంతగా. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 54 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ నటించిన ‘జల్సా’, ‘తమ్ముడు’ సినిమాలు మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. టికెట్స్ పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయంటే పవన్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 50 సంవత్సరాలు వచ్చినా పవన్ ఎంతో ఫిట్ గా ఉంటారు. అందుకు కారణం ఆయన సాత్విక ఆహారం తీసుకోవడమే. ఆయన అభిరుచులు, అలవాట్లు అన్ని పవన్ ని అంత ఫిట్, ఆరోగ్యంగా ఉంచుతున్నాయి.
కరాటేలో బ్లాక్ బెల్ట్
పవన్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు. కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించారు. తన సినిమాల్లో యాక్షన్, పైట్ సీక్వెన్స్ సీన్స్ చేసేటప్పుడు ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తారు. సినిమాలో అడపాదడపా తన కళను కూడా బయటపెట్టారు కూడా. తమ్ముడు సినిమాలో పవన్ తన చేతుల మీద కార్లు వెళ్ళే సీన్, ఖుషిలో తన స్నేహితుడు పెళ్లి చేసే సమయంలో పెళ్ళికూతురు తండ్రి రౌడీలను పంపించినప్పుడు కత్తితో ఆయన చేసిన విన్యాసాలు అందుకు ఉదాహరణలు. ఎంత కష్టం అయిన.. ఆయన చాలా సులభంగా చేయగల సామర్థ్యం ఉన్న ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు.
షావులిన్ కుంగ్ ఫూ శిక్షణ
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ షావులిన్ కుంగ్ ఫూ వెపన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అలాంటి శిక్షణ కోసం శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి. ఆ విషయంలో పవన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ‘‘ఆయనతో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. మార్షల్ ఆర్ట్స్ గురించి ఆయనకి మంచి పరిజ్ఞానం ఉంది’’ పవన్‌కు శిక్షణ ఇచ్చిన హర్ష ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
కురుసోవా, చేగువేరా అభిమాని
జపనీస్ చిత్ర నిర్మాత అకిరా కురుసోవా, చేగువేరా కి పవన్ వీరాభిమాని అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్, ఫిట్ నెస్ పట్ల తనకున్న ప్రేమకు అకిరా కురుసోవా ప్రేరణ అని చాలాసార్లు చెప్పారు కూడా. ఆయన అంటే ఎంత ప్రేమ అంటే తన కొడుకు పేరులో అకిరా ఉండే విధంగా పెట్టుకున్నారు. చేగువేరాకి కూడా అమితమైన ఆరాధికుడు. చేగువేరా రాసిన పుస్తకాలు చదువుతూ పలు సందర్భాల్లో కనిపించారు.
సాత్విక ఆహారాన్ని తింటారు
మానసిక సంతోషాన్ని పెంచుకోవడానికి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. శక్తి, సంతోషం, ప్రశాంతత, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తినాలని ఆయుర్వేదం చెప్తుంది. పవన్ దాన్నే ఫాలో అవుతారు. సాత్విక భోజనం అంటే ఆయుర్వేదంలో చెప్పినట్లుగా తీసుకునే ఆహారం. ఇది తినే వారి ఆలోచన స్వభావం వారి శ్రేయస్సుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది స్వచ్చమైన శాఖాహారం. తాజా కూరగాయలు, కాలానుగుణంగా వచ్చే పండ్లు, తృణధాన్యాలు, మొలకలు, పప్పులు, తేనె, విత్తనాలు తీసుకుంటారు. ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. మానసిక ప్రశాంత కూడా ఇస్తుంది.
పవన్ షూటింగ్స్ నుంచి విరామం దొరికినప్పుడు తన ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. ఎన్నో సార్లు స్వయంగా అక్కడ సేద్యం చేస్తున్న ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. చాలా నిరాడంబరంగా ఉంటూ తెల్లని దుస్తులు ధరిస్తారు. తీరిక సమయాల్లో విప్లవాత్మక భావాలు ఉండే పుస్తకాలను చదువుతూ ఉంటారు.
Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా
Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డమ్ వచ్చేదా?