పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఏవరేజ్ అనిపించుకున్న సినిమాలు ఉన్నాయి. ఫ్లాప్‌ చిత్రాలూ ఉన్నాయి. ఆ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథలు కూడా చాలా ఉన్నాయి. విశేషం ఏమిటంటే... ఆ కథలు వేరే హీరోలు చేయడం, ఆ కథలతో చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కావడం! బహుశా... ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరో కూడా ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసి ఉండరేమో!!


ప్రతి మెతుకు మీద భగవంతుడు తినేవాడి పేరు రాస్తాడని అంటుంటారు. అదే విధంగా ప్రతి కథ ఎవరో చేయాలో దేవుడు ముందే నిర్ణయిస్తాడు ఏమో!? అయితే, పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఆ కథలు ఏవి? ఆ కథలతో వేరే హీరోలు చేసిన చేసిన సినిమాలు ఏవి? అందులో ఇండస్ట్రీ హిట్స్, కల్ట్ క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నవి ఏవి? అనేది ఒక్కసారి చూస్తే (Pawan Kalyan Birthday Special)...


అతడు... పవన్ కళ్యాణ్!
త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో 'అతడు' చిత్రానిది ప్రత్యేక స్థానం! ఇప్పటికీ టీవీలో ఆ సినిమా వస్తుందంటే చాలు... పనులు పక్కన పెట్టి మరీ చూసే ప్రేక్షకులున్నారు. ఆ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్  బాబు నటన కూడా అద్భుతమే. అయితే... ఆ కథ ముందు మహేశ్ దగ్గరకు వెళ్ళలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ వినిపించారు. ఈ విషయం పవన్ స్వయంగా చెప్పారు. అయితే... త్రివిక్రమ్ కథ చెబుతున్న సమయంలో నిద్రపోయానని తెలిపారు. స్టూల్ మీద కూర్చుని పవన్ నిద్రపోయారని తర్వాత త్రివిక్రమ్ చెప్పారు. ఆ నిద్ర 'అతడు' కథను మహేష్ దగ్గరకు తీసుకు వెళ్ళింది. సినిమా బయటకు వచ్చింది. కొన్నాళ్ళకు కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది.


'అతడు' కథ వింటూ పవన్ కళ్యాణ్ నిద్రపోయినా... తర్వాత ఆయన దగ్గరకు 'జల్సా' కథతో వెళ్ళారు త్రివిక్రమ్. పవన్ అభిమానుల చేత 'ఖుషి' చేయించిన చిత్రమది. ఆ తర్వాత పవన్, త్రివిక్రమ్ కలయికలో ఇండస్ట్రీ హిట్ 'అత్తారింటికి దారేది' వచ్చింది. అంచనాలు అందుకొని 'అజ్ఞాతవాసి' చేశారు.


ఇండస్ట్రీ హిట్ పోకిరీ కూడా... 
పవన్ కళ్యాణ్ చేయాల్సిన కథేమహేశ్ బాబు కెరీర్‌లో మరో స్పెషల్ ఫిల్మ్, ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సిన కథే. అండర్ కవర్ కాప్ పండుగాడి పాత్రలో దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుగా ఊహించుకున్నది పవన్ కళ్యాణ్‌నే. ఉహించుకోవడమే కాదు, కథ కూడా వినిపించారు. కథ బాలేదని చెప్పలేదు కానీ ఎందుకో పవన్ చేయలేదు. ఆ తర్వాత ఆ సినిమా మహేశ్ దగ్గరకు వెళ్ళింది. 


ఛోటాకు అమ్మ నాన్న... 
పవన్‌కు బద్రి... బద్రీనాథ్!
'పోకిరి' కంటే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పూరి జగన్నాథ్ మూడు కథలు వినిపించారు. 'బద్రి', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్'. 'బద్రి'తో పూరిని దర్శకుడిగా పరిచయం చేసిన పవన్... మిగతా కథలు పక్కన పెట్టారు. అసలు, పవన్ దగ్గరకు వెళ్లి 'బద్రి' కథ వినిపించడానికి ముందు పూరి జగన్నాథ్ ఏం చేశారో? అందరికీ తెలిసిందే. సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడుకు 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' కథ వినిపించారు. అది నచ్చడంతో పవన్‌కు పూరిని రిఫర్ చేశారు. 


''ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' కథలు బాలేదని పవన్ కళ్యాణ్ చెప్పలేదు. బావున్నాయని అన్నారు. కానీ, ఎందుకో చేయలేదు'' అని ఆ మధ్య పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. 'పోకిరి' మహేశ్ చేస్తే... మిగతా రెండు కథలు మాస్ మహారాజా రవితేజ చేశారు. ముఖ్యంగా 'ఇడియట్' సినిమా రవితేజను మాస్ ప్రేక్షకులకు ఎంత దగ్గర చేసింది? ఆయనకు ఎటువంటి విజయాన్ని అందించింది? అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూడు కథలు రిజెక్ట్ చేసినా... 'బద్రి' తర్వాత పూరితో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చేశారు పవన్.


'గజినీ' రీమేక్‌కు 'నో' చెప్పిన పవన్
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రీమేక్స్ ఉన్నాయి. అయితే... 'గజినీ' రీమేక్ చేయడానికి మాత్రం పవన్ కళ్యాణ్ 'నో' చెప్పారు. అప్పటికి తమిళ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన సూర్యకు తెలుగులో మార్కెట్ క్రియేట్ కావడానికి ఆ సినిమా కారణం అని చెప్పక తప్పదు. తెలుగులో 'గజినీ' డబ్బింగ్ విడుదల కావడానికి ముందు, రీమేక్ చేయమని నిర్మాతలు పవన్ దగ్గరకు వెళ్లారు. తాను గుండుతో కనిపిస్తే ప్రేక్షకులు చూస్తారో? లేదో? అని పవన్ చేయలేదు. ఆ సినిమా చేయడానికి తనకు ఆత్మవిశ్వాసం సరిపోలేదని ఆయన చెప్పారు. డబ్బింగ్ చేయమని పవన్ ఇచ్చిన సలహాతో సూర్య హీరోగా 'గజిని' తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా


'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కథ విన్న వెంకటేశ్, తనకు తమ్ముడి పాత్రలో పవన్ కళ్యాణ్ అయితే బావుంటుందని నిర్మాత 'దిల్' రాజుతో చెప్పారు. అయితే, పవన్‌కు కథ చెప్పలేదు. ఏడాది తర్వాత 'మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్‌' విడుదల కావడం, ఆ సినిమా చూసిన తర్వాత 'దిల్' రాజుకు మహేశ్ అభినందించడం జరిగాయి. ఆ సమయంలో 'దూకుడు' షూటింగ్ జరుగుతోంది. అక్కడికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను తీసుకువెళ్లి మహేశ్‌కు కథ వినిపించారు. ఆయన 15 నిమిషాలు విని ఓకే చేశారు. 'మిరపకాయ్' కథ కూడా ముందు పవన్ కళ్యాణ్‌కు వినిపించారు హరీష్ శంకర్. కథ విన్నప్పుడు పవన్ ఎంజాయ్ చేశారని, అయితే ఎందుకో ఆ సినిమా పట్టాలు ఎక్కలేదని దర్శకుడు తెలిపారు.



Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే