సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి... అతడు. రెండు... ఖలేజా. 'అతడు' కల్ట్ క్లాసిక్ కాగా... 'ఖలేజా' మహేశ్‌కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
సెప్టెంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా (SSMB28) రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారట. యాక్షన్ సీక్వెన్సుతో షూట్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది.
బస్‌లతో ఫైట్... మామూలుగా ఉండదు!
మహేశ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. అందులో చాలా బస్సులు ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ఆ ఫైట్ సీక్వెన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. అది మామూలుగా ఉండదని టాక్. మహేశ్ బాబు డేర్ డెవిల్ స్టంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతోందట. ఘట్టమనేని ఫ్యాన్స్, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
త్రివిక్రమ్ మాస్ అంటే మామూలుగా ఉండదు!
మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అతడు'లో పొలంలో తీసిన ఫైట్ మాసీగా ఉంటుంది. అలాగే, 'జల్సా'లో ముఖేష్ రుషి పొలంలో ఉత్తరాది మనిషిని బెదిరించే సీన్... 'అరవింద సమేత వీరరాఘవ'లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ కూడా చాలా మాసీగా ఉంటాయి. బావుంటాయి. అందువల్ల, మహేశ్ బాబు లేటెస్ట్ మూవీలో మాస్ ఫైట్ అనేసరికి అభిమానుల్లో అంచనాలు పెరగడం సహజం.
తరుణ్ లేడు... రోషన్ మాథ్యూ ఉన్నాడు!
మహేశ్ బాబు సినిమాలో తరుణ్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, తనను ఎవరూ సంప్రదించలేదని తరుణ్ స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత టాక్ ఏంటంటే... రోషన్ మాథ్యూకు కీలక పాత్ర దక్కిందని తెలుస్తోంది. మాలయాళంలో కొన్ని సినిమాలు చేయన, విక్రమ్ 'కోబ్రా'లోనూ కీలక పాత్ర చేశారు. ఆయన నటన నచ్చడంతో త్రివిక్రమ్ మంచి రోల్ ఆఫర్ చేశారట.
Also Read : 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే
పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడి సినిమా అంటే ఫైట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. భారీ మాస్ యాక్షన్ సీన్లు తీస్తారు. సో... మహేశ్ నుంచి మాస్ ఆశిస్తున్న అభిమానులకు ఇప్పుడు ఈ త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత సినిమా యాక్షన్ విందు అందిస్తాయని చెప్పవచ్చు.