JD(U) MLAs Join BJP: 


ఈశాన్య రాష్ట్రాలపై గురి..


మణిపూర్‌లో జేడీ(యూ) ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో 5గురు భాజపాలో చేరారు. నితీష్ కుమార్...భాజపాతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో..ఆ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ అసెంబ్లీ సెక్రటరీ మేఘజిత్ సింగ్ దీనిపై ఓ ప్రకటన చేశారు. త్వరలోనే మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆ ఎమ్మెల్యేల చేరికను అధికారికంగా ఆమోదిస్తారనివెల్లడించారు. మణిపూర్‌లో జేడీ(యూ)కి 7గురు ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 5గురు అంటే...మూడింట రెండొంతుల మంది భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపుతుండటం వల్ల ఇది ఫిరాయింపుల కిందికి రాదని భాజపా భావిస్తోంది. అందుకే...అధికారికంగా వారిని చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని జేడీయూ ఎమ్మెల్యేలపై భాజపా గురి పెట్టడం ఇది రెండోసారి. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌లో2020లో ఏడుగురు JDU ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాలో చేరారు. గతవారం ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అంటే...అరుణాచల్‌ ప్రదేశ్‌లో JDU ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోయిందన్నమాట. ఈ సారి మణిపూర్‌లోని ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా భాజపా నేతలు కొందరు స్పందించారు.


ప్రధాని రేస్‌లో నితీష్..? 


2024లో ప్రధాని పదవికి నితీష్ కుమార్ పోటీ పడతారన్న వార్తల నేపథ్యంలో...భాజపా నేత అమిత్ మాల్వియా సెటైర్లు వేశారు. "సీఎంగానే విఫలమైన వ్యక్తి ప్రధాని పదవి కోసం చూస్తుండటమేంటో. రాష్ట్రంలో ఆయన పార్టీ ఎప్పుడో అప్పుడో కుప్పు కూలిపోక తప్పదు" అని విమర్శించారు. ట్విటర్ వేదికగా కౌంటర్‌లు వేశారు. "పశ్చిమ బెంగాల్‌ను దాటి ప్రజల నమ్మకాన్ని పొందాలని ప్రయత్నించిన మమతా బెనర్జీ విఫలమయ్యారు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అదే చేస్తున్నారు. సీఎంగానే విఫలమైన వ్యక్తి...సొంత పార్టీ మునిగిపోతుంటే...ప్రధాని పదవి కోసం ఆరాటపడుతున్నారు" అని ట్వీట్ చేశారు. ఇటీవలే నితీష్ కుమార్ భాజపా నేతృత్వంలోని NDA నుంచి బయటకు వచ్చేశారు.ఆర్‌జేడీతో జోడీ కట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయటమే కాకుండా...ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడ్డాకే... నితీష్ 2024లో ప్రధాని పదవికి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్ని నితీష్ కొట్టి పారేస్తున్నప్పటికీ...ఆ చర్చ మాత్రం జోరుగానే సాగుతోంది. భాజపా, జేడీయూ మధ్య వార్ నడుస్తుండగానే...జేడీయూ ఎమ్మెల్యేలు కాషాయ పార్టీలో చేరడం చర్చకు దారి తీసింది. కేహెచ్ జ్యోకిషన్, ఎన్ సనాతే, ఎమ్‌డీ అచబ్ ఉద్దీన్ సహా మరో ఇద్దరు భాజపాలో చేరారు. ఎమ్మెల్యేలు కౌతే, అరుణ్ కుమార్‌... గతంలోనే భాజపా టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూసినా...అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆ గూటికే చేరారు. అయితే...అటు నితీష్ కుమార్ మాత్రం జాతీయ రాజకీయాల గురించి వీలైనంత తక్కువగా మాట్లాడుతున్నారు.