Sugar Exports:
ప్రపంచ దేశాలకు భారత్ 'స్వీట్' షాక్ ఇవ్వనుంది! చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనుంది. తగినంత వర్షపాతం లేకపోవడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో చెరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. స్థానికంగా కొరత రావొద్దనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా పంచదార ధరలు పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఆంక్షలు విధించబోతుందని అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఒకవేళ స్థానికంగా పంచదార ఉత్పత్తి పెరిగితే కొన్ని దేశాలకు కోటా మంజూరు చేస్తారు.
చివరి ఐదేళ్లతో పోలిస్తే ఈసారి రుతుపవనాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. సగటు వర్షపాతమూ నమోదవ్వలేదు. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి తగ్గే ప్రమాదం నెలకొంది. ఒకవేళ అదే జరిగితే ఆహార ధరలు మరింత పెరుగుతాయి. 2024 ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఎగుమతులు ఆగిపోతే న్యూయార్క్, లండన్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ధరలు పెరగనున్నాయి.
భారత్ 2022-23లో కోటా వ్యవస్థను ప్రవేశపెట్టింది. వర్షపాతం సరిగ్గా లేకపోవడంతో ఆరు మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అంతకు ముందు ఏడాది 11 మిలియన్లతో పోలిస్తే ఇది తక్కువే. పంచదార ఉత్పత్తి తక్కువగా ఉండటంతో విదేశాలకు ఎగుమతులు తగ్గుతాయని అనలిస్టులు, మిల్లర్లు గతనెల్లో బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. మహా అయితే రెండు మిలియన్లే ఎగుమతి చేయొచ్చని స్పందించారు.
సరఫరా తక్కువగా ఉండటంతో సెప్టెంబర్లో ముడి చక్కెర ఫ్యూచర్స్ 12 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా పంచదారను ఉత్పత్తి చేసే బ్రెజిల్‌లో చెరకు పంట సాగు బాగున్నా ధరలు పెరగడం గమనార్హం. భారత్‌లో కర్ణాటక, మహారాష్ట్రలో చెరకు పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వర్ష రుతువులో ఇక్కడ వర్షాలు తగినంత కురవలేదు. కరవు రావడంతో థాయ్‌లాండ్‌లో చక్కెర ఉత్పత్తి పడిపోనుంది. ఎల్‌నినో వల్లే అనేక దేశాల్లో వర్షాలు కురవడం లేదు.