Colored Hair Care : ట్రెండ్​కి తగ్గట్లు హెయిర్ స్టైల్స్ మార్చడం, హెయిర్ కలర్స్ మార్చడం అందరికీ అలవాటే. అయితే కాలుష్య కోరల నుంచి జుట్టును కాపాడుకోవడం వేరు.. హెయిర్ కలర్ వేయించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త వేరు. మామూలుగా ఉన్నప్పుడు జుట్టుకు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోకున్న పర్లేదు కానీ.. జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు కచ్చితంగా కేర్ తీసుకోవాలంటున్నారు. లేదంటే జుట్టు పరిస్థితి చేజారిపోతుంది అంటున్నారు. అయితే జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 



మార్పుకోసమో.. లేదంటే స్టైల్​గా ఉంటుందనో చాలా మంది జుట్టుకు రంగులు వేయించుకుంటారు. అవి మనకి సెట్​కావని.. లేదంటే మన లుక్​కి సెట్​ కాలేదని రంగు వేయించుకున్నాకే తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చిన మెచ్చిన హెయిర్ కలర్ వేయించుకున్నా సరే జుట్టును నిర్లక్ష్యంగా ఉంచేస్తే అది పూర్తిగా కరాబ్ అవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో జుట్టుకు మరింత సంరక్షణ ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.


డ్రై స్కాల్ప్​కి ప్రత్యేక శ్రద్ధ


జుట్టుకు రంగు వేయించుకున్నప్పుడు వచ్చే ప్రధాన సమస్య జుట్టు డ్రై అయిపోవడం. అయితే కొన్ని చిట్కాలతో మెరిసే, అందమైన హెయిర్​ని పొందవచ్చు. రంగు ఎక్కువరోజులు ఉండాలి అనుకున్నప్పుడు.. హెయిర్ వాష్ సమయంలో చాలా సున్నితంగా వాష్ చేయాలి. ఒకవేళ మీకు చెమట ఎక్కువగా పడుతుంది అనుకుంటే తరచుగా షాంపూ చేయాలి. ఎందుకంటే చెమట, రంగు కలిసి మీ స్కాల్ప్​ను డ్రై చేయడం, ఇన్​ఫెక్షన్​లకు గురిచేస్తుంది. కాబట్టి చెమటగా అనిపించినప్పుడు, వర్షాకాలంలో తడిసినప్పుడు తలస్నానం చేయండి. 


షాంపూల ఎంపిక


మీ స్కాల్ప్​కి ఇబ్బంది లేకుండా, కలర్ త్వరగా వాష్ కాకూడదని చూసుకుంటే మీరు మంచి కలర్​ ఫిక్సేషన్ షాంపూ, కండీషనర్​ని వినియోగించాలి. వాటిలో సున్నితమైన శుభ్రపరిచే రసాయనాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్​ మీద pH విలువలను అదుపులో ఉంచుతాయి. మంచి పోషణ అందిస్తూ.. జుట్టు తంతువులను దృఢంగా చేస్తాయి. కలర్​ ఫిక్సేషన్ హెయిర్​ మాస్క్​లు ఉపయోగిస్తే జుట్టుకు చాలా మంచిది. ఈ మాస్క్​లు జుట్టుకు మెరుపునివ్వడమే కాకుండా.. కీలకమైన పోషకాలు అందిస్తాయి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి కనీసం రెండుసార్లు ఇవి అప్లై చేయండి. రంగు వేసుకోనివారు కూడా హెయిర్ మాస్క్​లు తరచూ అప్లై చేస్తే.. జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి. 


హెన్నాతో లాభాలు


మీరు మీ జుట్టుకు రంగు వేయాలనుకుంటే కెమికల్స్​కు బదులుగా హెన్నాను వినియోగించవచ్చు. సహజమైన హెన్నా పేస్ట్.. మార్కెట్లలో లభ్యమయ్యే కెమికల్ హెయిర్ కలర్స్​కు మంచి ప్రత్యామ్నాయం. అయితే హెన్నాను ఎంచుకునే సమయంలో  TEA, DEA, సల్ఫేట్లు, PPD, రెసోర్సినోల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి సమ్మేళనాలు లేకుండా చూసుకోవాలి. హెన్నాతో డిఫరెంట్ కలర్స్ కావాలనుకునేవారు బ్రెజిలియన్ మూలికలు, బీట్​రూట్​, దానిమ్మ వంటివి ట్రై చేయవచ్చు. ఇది తెల్లని జుట్టును కవర్​ చేయడమే కాకుండా.. జుట్టుకు, తలకు మంచి పోషణ అందిస్తుంది. 


వాటికి దూరంగా ఉండండి..


అమ్మోనియా, దానికి సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి తాత్కాలిక ఫలితాలు అందించినప్పటికీ.. దీర్ఘకాలికంగా హాని కలిగిస్తాయి. అమ్మోనియా దాని ఉప ఉత్పత్తులైన ఇథనోలమైన్, డైటానోలమైన్, ట్రైథనోలమైన్​లను కలిగి ఉంటుంది.  ఇవి హర్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. క్యాన్సర్​కు కారణమయ్యే పారాబెన్​లు, సల్ఫేట్​లు లేకుండా ఉండేవి ఎంచుకోండి. 
కొందరు తలస్నానం చేసిన వెంటనే టవల్​తో జుట్టును గట్టిగా కొడుతూ ఆరబెడతారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇది జుట్టు రఫ్​గా మారేలా చేస్తుంది. జుట్టును గట్టిగా టవల్​తో రుద్దడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తలలో ఉండే అదనపు నీటిని మెత్తటి టవల్​తో తీసేయవచ్చు. లేదంటే గాలికి ఆరనివ్వండి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీ రంగుల జుట్టును కాపాడుకోవచ్చు.


Also Read : ఈ సింపుల్ స్ట్రెచ్స్​ మీ నడుము నొప్పిని దూరం చేసేస్తాయి