India’s GDP Growth: FY24 జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌ కాలం), వార్షిక ప్రాతిపదికన, భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) అద్భుతమైన అంకెను నమోదు చేసింది. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా 7.8 గ్రోత్‌ రేట్‌తో నాలుగు త్రైమాసిక గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ డేటాను విడుదల చేసింది.


కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన వ్యయం (క్యాపెక్స్) కోసం ఖజానాలను ఓపెన్‌ చేయడం, వినియోగ డిమాండ్ బలంగా ఉండడం, సేవల రంగంలో రెండంకెల వృద్ధి కలిసి జీడీపీని పరిగెత్తించాయి.


రంగాల వారీగా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌ సహా కాంటాక్ట్-ఇంటెన్సివ్ రంగాలు 9.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంతకుముందు క్వార్టర్‌లో 9.1 శాతంగా ఉన్న ఈ సంఖ్య, ఈసారి స్వల్పంగా పెరిగింది.


రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్‌ సెక్టార్లు కూడా వార్షిక ప్రాతిపదికన (YoY) 12.2 శాతం పుంజుకున్నాయి. నిర్మాణం, గనులు, తయారీ రంగాల నంబర్లు వరుసగా 7.9 శాతం, 5.8 శాతం, 4.7 శాతంగా ఉన్నాయి.


గవర్నమెంట్‌ లెక్కల ప్రకారం.... వ్యవసాయం, విద్యుత్ రంగాలు 3.5 శాతం, 2.9 శాతం వృద్ధిని రికార్డ్‌ చేశాయి. GDP వాటాలో 57.3 శాతంగా ఉన్న ప్రైవేట్ వినియోగం FY24 తొలి త్రైమాసికంలో 6 శాతం పెరిగింది.


అంచనాలకు అనుగుణంగా..
ఈ ఆర్థిక సంవత్సరం (FY24) మొదటి త్రైమాసికంలో డీజీపీ గ్రోత్‌ రేట్‌ 7.5 శాతం నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని 20 మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వాళ్లందరి సగటు అంచనా 7.8 శాతం. ఈ ఎక్స్‌పెక్టేషన్‌కు తగ్గట్లుగానే ఆర్థిక వృద్ది రేటు సాధ్యమైంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాత్రం 8 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.


FY23 మార్చి త్రైమాసికంలో (జనవరి-మార్చి కాలం) భారతదేశ GDP 6.1 శాతం వృద్ధి చెందగా, మొత్తం FY23లో 7.2 శాతానికి పెరిగింది.


సర్వీస్‌ సెక్టార్‌లో డిమాండ్, పెట్టుబడులు నిరంతరం పెరగడం, తగ్గిన కమోడిటీ ధరలు.. దేశాభివృద్ధికి ఊతమిచ్చాయి. అయితే... భారీ వర్షాలు, మానిటరీ టైట్‌ కావడం, విదేశాల నుంచి వచ్చే డిమాండ్‌ బలహీనపడడం వంటివి Q1 FY24లో GDP వృద్ధిపై నెగెటివ్‌ ఇంపాక్ట్‌ చూపాయి.


GDP వృద్ధికి కాపెక్స్ పుష్ మరొక ముఖ్యమైన అంశం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలి నెలల్లో మూలధన వ్యయంపై తన దృష్టిని కొనసాగించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఖర్చు చేసిన రూ. 1,75,000 కోట్ల నుంచి 2023 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో మూలధన వ్యయం దాదాపు రూ. 2,78,500 కోట్లకు పెరిగింది.


Q1లో, కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ మొత్తంలో 27.8 శాతం ఖర్చు చేయగా, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వ్యయం 12.7 శాతం. దీంతోపాటు... కేంద్రం & 23 రాష్ట్రాల (అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, మణిపూర్, మేఘాలయ మినహా) క్యాపెక్స్ గత ఏడాది కంటే ఈసారి వరుసగా 59.1 శాతం, 76 శాతం పెరిగాయి.


మొత్తం FY24లో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే... మందగిస్తున్న ప్రపంచ వృద్ధి రేట్లు, అసమాన రుతుపవనాలు, ఎల్ నినో ఆందోళనలు ఈ అంచనాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


భారత వాతావరణ విభాగం (IMD) లెక్క ప్రకారం...ఆగస్టు నెలలో 36% తక్కువ వర్షపాతం కురిసింది, గత 122 సంవత్సరాల్లో ఇదే అధ్వాన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2023 రుతుపవనాల సీజన్‌లో “సాధారణం కంటే తక్కువ” వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.


ఆర్‌బీఐ, గత 3 సమావేశాలుగా రెపో రేటును పెంచలేదు, 6.50% వద్దే కంటిన్యూ చేస్తూ వచ్చింది. 


మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో ప్రధాన పండుగలున్నాయ్‌, బ్యాంకులు 16 రోజులు పని చేయవు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial