Neeraj Chopra: కొద్దిరోజుల క్రితమే బుడాపెస్ట్ వేదికగా ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌లోని జురిచ్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్‌లోనూ సత్తా చాటాడు. సెంటిమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయినా రెండో స్థానంలో నిలిచాడు. గురువారం ముగిసిన డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీలలో నీరజ్ చోప్రా.. ఈటను 85.71 మీటర్ల దూరం విసిరాడు. తొలి స్థానం దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ వాద్లెచ్.. 85.86 మీటర్లు విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇద్దరి మధ్య దూరం 0.15 సెంటిమీటర్లు మాత్రమే కావడం గమనార్హం.
వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ముగిశాక భుజం నొప్పితోనే బరిలోకి దిగిన నీరజ్.. ఇబ్బందిగానే కనిపించాడు. తొలి ప్రయత్నంలో నీరజ్ 80.79 మీటర్లు విసిరాడు. తర్వాత రెండుసార్లూ అతడు ఫౌల్ చేశాడు. కానీ నాలుగో ప్రయత్నంలో మాత్రం 85.22 మీటర్ల దూరాన్ని విసిరి టాప్ - 2లోకి వచ్చాడు. ఐదో ప్రయత్నంలో మరోమారు ఫౌల్ చేసిన నీరజ్.. ఆఖరి సారి మాత్ర 85.71 మీటర్ల దూరాన్ని విసిరాడు. ఐదో ప్రయత్నంలో వాద్లిచ్ 85.86 మీటర్ల దూరం విసరడంతో అతడికే అగ్రస్థానం దక్కింది. జర్మనీ ప్లేయర్ వెబర్ 85.04 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
జురిచ్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానం దక్కించుకోవడంతో అతడు సెప్టెంబర్ 17 నుంచి యూఎస్ఎ (యూగెన్) వేదికగా జరగాల్సి ఉన్న డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది మే లో దోహా (ఖతార్), లాసన్నె (స్విట్జర్లాండ్) వేదికగా జూన్‌లో జరిగిన డైమండ్ లీగ్స్‌లో నీరజ్ తొలి స్థానంలో నిలిచిన విషయం విదితమే.
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. వారం వ్యవధిలోనే జరిగిన డైమండ్ లీగ్‌లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ పోటీలకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను భుజం నొప్పితో ఉన్నానని చెప్పాడు. పూర్తిస్థాయి ఫిట్‌గా లేని నీరజ్.. డైమండ్ లీగ్‌లో 90 మీటర్లు వేస్తాడని అంతా భావించారు. కానీ నీరజ్ మాత్రం 85 మీటర్లకే పరిమితమయ్యాడు.
లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్..
డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాతో పాటు మరో అథ్లెట్ కూడా మెరిశాడు. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ 7.99 మీటర్లూ దూకి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బుడాపెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించలేకపోయినా తాజా పోటీలలో అతడు ఐదో స్థానంలో నిలవడంతో సెప్టెంబర్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. తొలి జంప్‌లోనే 7.99 మీటర్లు లంగించిన మురళీ.. తర్వాత దానిని మెరుగుపరుచుకోలేకపోయాడు. ఒలింపిక్, వరల్డ్ ఛాంపియన్ మిల్టిదిస్ టెంటొగ్లొ (గ్రీస్) 8.20 మీటర్లు దూకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial