Income Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆ కారణంగా అసెస్‌మెంట్ ఇయర్  2021-22 కుగానూ ఆదాయపు పన్ను వివరాలు (ITR) దాఖలు చేయడానికి డిసెంబర్ 31, 2021 వరకు గడువును పొడిగించారు. దాదాపు 6.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. 


కొత్త పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 4.5 కోట్ల మందికి రిఫండ్ అయినట్లు సమాచారం. మీరు ఇప్పటికే మీ ITRని ఫైల్ చేసి, పన్ను నగదు మీకు రావాల్సిన మొత్తం కోసం వేచి ఉన్నట్లయితే, అందుకు గల కారణలు తెలుసుకోవాలి. తద్వారా మీ ఐటీ రిటర్న్స్ రిఫండ్ మీరు పొందవచ్చు.


ITR మీరు ధ్రువీకరించలేదు
ITR వెరిఫై అయితే మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినట్లు అవుతుంది.  ఈ ఐటీఆర్ ధ్రువీకరణ ఎలక్ట్రానిక్ పద్ధతిలో లేదా ITR-V సంతకం చేసిన కాపీని బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్‌కి పంపడం ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిటర్న్స్ దాఖలు చేసినట్లైతే అది వెరీఫై అయిందో లేదో చెక్ చేసుకోండి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన రోజు నుంచి 120 రోజులలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.


పన్ను చెల్లింపుదారులు  ఆధార్ OTP లేదా నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ద్వారా ఈ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ITR-Vని CPC బెంగళూరుకు పంపడం ద్వారా రిటర్న్‌ని వెరిఫై చేసుకోవాలనుకుంటే మీరు సంతకం చేసిన ITR-V కాపీని సాధారణ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన రోజునుంచి 120 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలి. ఒకవేళ సంతకం చేసిన కాపీని పంపడం మరిచిపోయినా, లేక సంతకం చేయకుండా ఐటీఆర్ వీ కాపీని పంపించినా అది చెల్లుబాటు కాదు.


బ్యాంక్ ఖాతా వెరిఫై చేయాలి
పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి. అలా చేస్తేనే మీ బ్యాంక్ అకౌంట్‌కు ఐటీఆర్ రిఫండ్ నగదు జమ అవుతుంది. కనుక మీరు ITRలో మీ బ్యాంక్ ఖాతా వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి. అది మాత్రమే సరిపోదు. మీకు ఏ ఖాతాకు ఐటీఆర్ రిఫండ్ కోరుకుంటున్నారో ఆ బ్యాంక్ ఖాతా వివరాలు సైతం ధ్రువీకరించుకోవాలి. 


ఆదాయపు పన్ను పోర్టల్‌లో ప్రాథమిక సంప్రదింపు వివరాలుగా పేర్కొన్న మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి, బ్యాంక్ ఖాతాలో పేర్కొన్న మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడితో సరిపోలితే మాత్రమే ఖాతా చెల్లుబాటు అవుతుంది. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ లో నమోదు చేసుకున్న ప్రైమరీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ కు ఇదే బ్యాంకు డిటైల్స్ నమోదు చేసి ఉంటే సరి. ఐటీ రిటర్న్స్ రివైజ్ చేయకుండానే ఏదైనా చెలామణిలో ఉన్న మీ బ్యాంకు అకౌంట్ డీటైల్స్‌ను డీఫాల్ట్ అకౌంట్‌గా మార్చుకోవాలి. 


పాత బకాయిలు పెండింగ్
గత సంవత్సరం అసెస్‌మెంట్‌కుగానూ ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన కొన్ని క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లయితే అవి పూర్తి చేసిన తరువాతే తాజా సంవత్సరం ఐటీ రిటర్న్స్ రిఫండ్ మీకు అందిస్తారు. మీరు ఎలాంటి బకాయి లేరని నిర్ధారించుకున్నాక ఆదాయపు పన్ను శాఖ రిఫండ్ రిలీజ్ చేస్తుంది.


కనుక మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు ఏమైనా నోటీసులకు సంబంధించి మెయిల్స్ వస్తే, తప్పకుండా దానిపై స్పందించాలి. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించుకోవాలని సూచించారు. 


కాంటాక్ట్ డీటైల్స్ అప్‌డేట్ చేయాలి
ఒకవేళ మీరు ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి సమాచారం అందించిన తరువాత సకాలంలో స్పందించడంలో విఫలమైతే మీరు ఐటీ శాఖకు చెప్పడానికి మీ వద్ద ఎలాంటి కారణాలు లేవని భావిస్తారు. కనుక మీరు ఐటీఆర్ వెబ్‌సైట్‌లో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, ప్రైమరీ కాంటాక్ట్ వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అవసరమైతే అప్‌డేట్ చేసుకోవడం బెటర్. 


Also Read: Financial Goal: SIP గురించి తెలుసు! మరి STPతో డబ్బే డబ్బన్న సంగతి తెలుసా!


Also Read: Health Insurance: స్మోకింగ్‌ చేస్తున్నారా? అటు లంగ్స్‌కు ఇటు ఇన్సూరెన్స్‌ ప్రీమియానికీ చిల్లు!