Smoking affects your health insurance premium: 'సిగరెట్‌, బీడీ, చుట్ట తాగడం ప్రమాదకరం! ఇవి క్యాన్సర్‌కు దారితీస్తాయి' అని నెత్తీనోరు కొట్టుకుంటున్నా ఈ అలవాటు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు! చాలామంది సమాజంలో ఇమేజ్‌ పెంచుకోవాలన్న ఫాల్స్‌ పర్సిప్షన్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొగ తాగడం వల్ల అనేక ప్రాణాంతక రోగాలు రావడమే కాకుండా జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం భారం పెంచుతాయి.


రెంటికీ చెడ్డ రేవడి


పొగ తాగడం వల్ల (Smoking) మొదటి ప్రమాదం మనుషుల ఆరోగ్యం చెడిపోవడం! తాగే వాడితో పాటు పక్కనుండి పీల్చేవాడికీ ప్రమాదమే. సాధారణ క్యాన్సర్‌ (oral cancer), ఊపిరి తిత్తుల క్యాన్సర్‌ (lung cancer), గుండె రక్తనాళాల జబ్బులు (coronary heart disease), ఎముకల బలహీన పడి ఆస్టియో పొరాసిస్‌ రావడం, తీవ్రమైన ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. పైగా సిగరెట్‌ తరహా ధూమాపాన ఉత్పత్తులపై టాక్సులు, ధరలు ఎక్కువ. అంటే ఆర్థిక జీవితమూ  (Financial Life) దెబ్బతింటుంది. స్మోకింగ్‌ వల్ల మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం (Health Insurance premium) మొత్తం కొండెక్కుతుంది.


బీమాలో రోగాలు మినహాయింపు


స్మోకింగ్‌ అంటేనే జబ్బులకు గేట్‌వే లాంటిది. దీంతో ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ విషయం బీమా కంపెనీలకు తెలుసు! అందుకు స్మోకర్లను హై రిస్క్‌ కేటగిరీలో ఉంచుతాయి. అలాంటి వారి బీమా ప్రీమియాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఇక కొన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలైతే స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారి బీమాలో అనేక రోగాలను తీసేస్తున్నాయి. స్మోకింగ్‌ వల్ల వచ్చే రోగాలు, జబ్బులను బీమా నుంచి తొలగించడం వల్ల అవసరానికి ఆ పాలసీ ఆదుకోకపోవచ్చు.


అబద్దం చెప్పకండి


ఏదేమైనా సరైన బీమా పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. ఇన్సూరెన్స్‌ కంపెనీలు బీమా ఇవ్వడం లేదని లేదా కొన్ని రోగాలకు కవరేజీ ఇవ్వడం లేదని తప్పుడు సమాచారం ఇవ్వొద్దు. స్మోకింగ్‌ అలవాటు లేదని చెప్పొద్దు. తప్పుడు సమాచారంతో ఇన్సూరెన్స్‌ ఫామ్‌ నింపడం మోసం కిందకు వస్తుంది. రెండోది అవసరమైనప్పుడు ఆ పాలసీతో ఉపయోగం ఉండదు. మీరు క్లెయిమ్‌ చేసుకొనేటప్పుడు కంపెనీలు ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెడతాయి. ఏ మాత్రం అనుమానం ఉన్నా క్లెయిమ్‌ను రిజెక్ట్‌ చేస్తాయి. అప్పటి వరకు కట్టిన ప్రీమియం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.


అధిక ప్రీమియం తప్పదు


స్మోకింగ్‌ చేస్తున్నంత మాత్రాన మీకు ఇన్సూరెన్స్‌ పాలసీని తిరస్కరించే హక్కు కంపెనీలకు లేదు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కొనుగోలు చేసే హక్కువుంది. కాకపోతే అప్పటికే మీకున్న జబ్బులు, ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలు వారికి ఇవ్వాలి. దానిని బట్టి మీ బీమా ప్రీమియాన్ని వారు డిసైడ్‌ చేస్తాడు. సాధారణంగా పొగ తాగే వారి బీమా ప్రీమియం సాధారణ వ్యక్తులకన్నా రెట్టింపు ఉంటుంది. ఏదేమైనా మీ పొగ తాగే అలవాటు వల్ల ప్రీమియం రూపంలో ఇంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ఎందుకు? సింపుల్‌గా స్మోకింగ్‌ మానేస్తే బెస్ట్‌ కదా!!!