Income Tax on Online Gaming: స్మార్ట్‌ ఫోన్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాక ఫాంటసీ గేమింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌ యాప్‌లు కోకొల్లలుగా పెరిగిపోయాయి. యువత, గేమింగ్‌ లేదా బెట్టింగ్స్‌ యాప్స్‌లో గంటల కొద్దీ గడుపుతూ, లక్షల కొద్దీ డబ్బులు గెలుచుకుంటోంది (గమనిక: ఎక్కువ మంది నష్టపోతున్నారు‌). ఇలా, ఒక ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీ ద్వారా భారతీయులు ఏకంగా రూ.58,000 కోట్లు గెలుచుకున్నారట. ఈ మొత్తాన్ని అక్షరాల్లో చెప్పుకుంటే.. యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు. గత మూడేళ్లలో ఇంత డబ్బు గెలుచుకున్నారని పత్యక్ష పన్నుల విభాగం (CBDT) కనిపెట్టింది. 


ఈ రూ.58,000 మీద టాక్స్‌ కట్టమని ఇప్పుడు సదరు విజేతల వెంటపడుతోంది ఆదాయ పన్ను విభాగం. ఇంతకీ, వాళ్లు కట్టాల్సిన టాక్స్‌ ఎంతో తెలుసా.. సుమారు రూ.20,000 కోట్లు. గేమర్లు గెలుచుకున్న డబ్బు మీద 30 శాతం పన్ను + ఇతర జరిమానాలు కలిపి ఇంత మొత్తం చెల్లించాల్సి ఉందట. ఆ డబ్బులు వెంటనే కట్టమని ఐటీ డిపార్ట్‌మెంట్‌ రిక్వెస్ట్‌ లాంటి వార్నింగ్‌ ఇచ్చింది.


విజేతలెవరో తమకు తెలుసని, ఆదాయపు పన్ను రిటర్న్‌లో గేమింగ్‌ ఆదాయాన్ని అప్‌డేట్‌ చేసి ఫైలింగ్‌ చేయాలని చెబుతోంది. వాళ్లంతట వాళ్లు స్వచ్ఛందంగా అప్‌డేటెడ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయకపోతే, తమ స్టైల్లో ముందుకు వెళ్తామని అంటోంది.


సదరు గేమింగ్‌ కంపెనీ పేరును మాత్రం ఐటీ డిపార్ట్‌మెంట్‌ చెప్పలేదు. ఆ గేమ్‌ విజేతలే కాదు, పాల్గొనేవాళ్ల డేటా కూడా తమ వద్ద ఉందని వెల్లడించింది.


ఐటీ డిపార్ట్‌మెంట్‌ చెబుతున్న ఈ విజయాలు 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినవి.


లాటరీలు; క్రాస్‌వర్డ్ పజిల్స్; రేసులు, గుర్రపు పందాలు; కార్డ్ గేమ్స్ సహా ఏ గేమ్‌ మీద డబ్బు గెలుచుకున్నా ఎటువంటి ప్రాథమిక మినహాయింపులు లేని 30 శాతం పన్నును విన్నర్స్‌ ప్రభుత్వానికి చెల్లించాలి. సాధారణంగా, ప్రైజ్ మనీలో మూలం వద్ద పన్నును (TDS) తీసేసి, మిగిలిన మొత్తాన్ని విన్నర్‌కి చెల్లిస్తారు. కొన్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌లో ప్రైజ్‌ మనీ విషయంలో TDS కట్‌ కావడం లేదు.


అయితే ఇక్కడొక విషయం. గేమ్‌లో ఒకవేళ మీరు నష్టపోతే, దానిని ప్రైజ్‌మనీ లేదా లాభంతో సర్దుబాటు చేయలేదు. అలాంటి రూల్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లో లేదు.


గత ఐదేళ్లలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు, సైట్‌ల పరిశీలనలో భాగంగా సదరు గేమింగ్ కంపెనీ మీద దర్యాప్తు చేస్తున్నట్లు ఆదాయపన్ను విభాగం వెల్లడించింది.


ఒక ముఖ్యమైన విషయం... క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్స్‌, బెట్టింగ్‌లపై 28 శాతం వస్తు, సేవల పన్ను (GST) విధించాలని ప్రభుత్వం చాలాకాలంగా భావిస్తోంది. GST కౌన్సిల్ తదుపరి సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. ఏ ప్రాతిపదికన 28 శాతం GST విధించవచ్చో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ అంశం చర్చకు వస్తే, క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్స్‌, బెట్టింగ్‌లపై GST విధింపునకు విధివిధానాలను రూపొందించవచ్చు. 


కాబట్టి; డెల్టా కార్ప్‌, నజారా టెక్నాలజీస్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌, ఆన్‌మొబైల్‌ వంటి స్టాక్స్‌ మీద ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉండడం మంచిది.