Income Tax Collection Cost: మన దేశంలో, పన్ను చెల్లించదగిన ఆదాయం ఉన్న వ్యక్తులు, కంపెనీల నుంచి ఆదాయ పన్నును ఆదాయ పన్ను విభాగం వసూలు చేస్తోంది. ఈ పన్ను వసూళ్ల కోసం ఐటీ విభాగం కొంత వ్యయం చేయకతప్పదు. టాక్స్ కలెక్షన్స్ కోసం ఆదాయ పన్ను శాఖ చేస్తున్న ఖర్చు ఏటికేడు తగ్గుతుండడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, డిపాజిట్ చేసిన మొత్తం పన్నులో ఈ వ్యయం దాదాపు అర శాతానికి సమానం. గత 20 సంవత్సరాల్లో (రెండు దశాబ్దాలు) ఇదే అత్యల్ప వ్యయం.
ఇప్పుడు పన్ను వసూలు ఖర్చు చాలా తక్కువ
ఆదాయ పన్ను & ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, మూలం వద్ద పన్ను మినహాయింపుల (TDS) పరిధి పెరుగుదల కారణంగా ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ తన ఖర్చును తగ్గించుకోగలుగుతోంది. ఆదాయపు పన్ను విభాగం విడుదల గణాంకాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్ను వసూళ్లు రూ. 14.12 లక్షల కోట్లు. అదే సమయంలో, పన్ను వసూలు ఖర్చు 0.53 శాతానికి సమానంగా ఉంది.
గణాంకాల ప్రకారం, కొన్నేళ్ల క్రితం వరకు, ఆదాయపు పన్ను విభాగం తన మొత్తం వసూళ్లలో కొంత ఎక్కువ భాగాన్ని పన్ను వసూళ్లకే వెచ్చించాల్సి వచ్చింది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం పన్నులో 1.36 శాతాన్ని వసూళ్ల కోసం ఆదాయ పన్ను విభాగం ఖర్చు చేసింది. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల వరకు, ఇది మొత్తం సేకరణల్లో ఈ వ్యయం 0.61 శాతం నుంచి 0.66 శాతం మధ్య ఉండగా, కరోనా ప్రభావిత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇది 0.76 శాతానికి కొద్దిగా పెరిగింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఆదాయపు పన్ను విభాగం ప్రధాన వ్యయంలోకి ఉద్యోగుల జీతాలు, పరిపాలన పరమైన పనులు, IT ఖర్చులు & కొన్ని ఇతర వ్యయాలు వస్తాయి.
రూపాయిల ప్రాతిపదికన పెరిగిన వ్యయం
వసూలైన మొత్తం పన్నులో చేసిన వ్యయాన్ని నిష్పత్తి రూపంలో కాకుండా, రూపాయల పరంగా చూస్తే పన్ను వసూలు ఖర్చు పెరుగుతూ వచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను విభాగం పన్ను వసూళ్ల కోసం రూ. 4,593 కోట్లు ఖర్చు చేయగా... 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 7,479 కోట్లకు పెరిగింది.
పన్నుల వసూళ్లలో పెరుగుదల
సమీక్షిస్తున్న కాలంలో మొత్తం ఆదాయపు పన్ను వసూళ్లు కూడా చాలా వేగంగా పెరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 7.4 లక్షల కోట్లు కాగా... 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 14.12 లక్షల కోట్లకు చేరాయి. అంటే, ఆరేళ్ల వ్యవధిలోనే మొత్తం పన్ను వసూళ్లు రెట్టింపు పైగా పెరిగాయి.
ఆదాయపు పన్ను విభాగం ఇటీవలి కాలంలో చేసిన ప్రయత్నాలు పన్నుల వసూళ్ల భారాన్ని తగ్గించాయని పన్ను నిపుణులు అంటున్నారు. పన్ను మదింపు నుంచి ఇతర చాలా విధానాల వరకు లోతైన లక్ష్యిత విధానాన్ని ఆదాయ పన్ను విభాగం అవలంబించడం ప్రారంభించింది. ఇది ఆ శాఖకు ఉపకరిస్తోంది. దీనికి తోడు సాంకేతికత వినియోగాన్ని పెంచడం వల్ల ఖర్చు కూడా తగ్గింది.