Income Tax Act: పన్ను ఎగవేతలను (Tax Evasion) సాక్ష్యాధార సహితంగా నిరూపించి, ఎగవేతదార్ల నుంచి పన్నులు + వాటిపై జరిమానాలు వసూలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం నిరంతరం సోదాలు నిర్వహిస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో, కొన్నిసార్లు అధికారుల దూకుడు కారణంగా పన్ను చెల్లింపుదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీనికి సంబంధించి, పన్ను చెల్లింపుదార్లకు సుప్రీంకోర్టు గొప్ప ఊరటనిచ్చింది.


ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153A (IT Act Section 153A) కింద సోదాలు జరిపినప్పుడు, నిర్దిష్టమైన ఆధారాలు లభించకపోతే పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ఏకపక్షంగా పెంచలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఒక ఆప్షన్‌
సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో పన్ను చెల్లింపుదార్లకు ఊరట లభిస్తుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆదాయ పన్ను విభాగం ఇష్టారాజ్యం ఇకపై తగ్గుతుందని కూడా భావిస్తున్నారు. అయితే, ఏదైనా నిర్దిష్ట సాక్ష్యం తర్వాత వెలుగులోకి వస్తే, పన్ను ఎగవేత కేసును తిరిగి తెరవవచ్చంటూ ఆదాయ పన్ను విభాగానికి సుప్రీంకోర్టు సూచించింది. తద్వారా ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఒక ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది.


అసెస్‌మెంట్‌ పూర్తయిన కేసులను తెరవలేరు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153A ప్రకారం, అసెస్‌మెంట్ పూర్తయిన కేసులను ఆదాయ పన్ను విభాగం తిరిగి తెరవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు, సెర్చ్ లేదా సీజ్ ఆపరేషన్ సమయంలో ఏదైనా ఖచ్చితమైన ఆధారం లేదా ఆధారాలు దొరికితే మాత్రమే రీ-అసెస్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశంలో పేర్కొంది.


ఇదే అంశంపై విచారణ సందర్బంగా, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రీ-అసెస్‌మెంట్ అనేది పన్ను చెల్లింపుదార్లపై పెద్ద ప్రభావం చూపే ప్రక్రియ అని ధర్మాసనం అభిప్రాయపడింది. 


పన్ను చెల్లింపుదార్లకు ఊరటతో పాటు, రీ-అసెస్‌మెంట్‌ మీద పన్ను అధికారుల నుంచి ఏకపక్ష నిర్ణయాలు, దూకుడును సుప్రీంకోర్టు తీర్పు తగ్గించగలదని భావిస్తున్నారు.


ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 153A ఏం చెబుతోంది?
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 153A ప్రకారం... ఆదాయ పన్ను అధికారులు తనిఖీ చేసిన పన్ను చెల్లింపుదారు ఆదాయాన్ని నిర్ధరించే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారు వెల్లడించని ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావడమే ఈ సెక్షన్‌ ఉద్దేశం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 147 & 148 ప్రకారం కేసులను తిరిగి తెరవవచ్చు.


తగ్గిన పన్ను వసూళ్ల వ్యయం
టాక్స్‌ కలెక్షన్స్‌ కోసం ఆదాయ పన్ను విభాగం చేస్తున్న ఖర్చు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. ఐటీ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్ను వసూళ్లు రూ. 14.12 లక్షల కోట్లు. అదే సమయంలో, పన్ను వసూళ్ల ఖర్చు 0.53 శాతం. గత 20 సంవత్సరాల్లో ఇదే అత్యల్ప వ్యయం. 2000-01 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం పన్నులో 1.36 శాతాన్ని వసూళ్ల కోసం ఆదాయ పన్ను విభాగం ఖర్చు చేసింది. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల వరకు, ఇది మొత్తం సేకరణల్లో ఈ వ్యయం 0.61 శాతం నుంచి 0.66 శాతం మధ్య ఉండగా, కరోనా ప్రభావిత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇది 0.76 శాతానికి కొద్దిగా పెరిగింది.


పన్నుల వసూళ్లలో పెరుగుదల
సమీక్షిస్తున్న కాలంలో మొత్తం ఆదాయపు పన్ను వసూళ్లు కూడా చాలా వేగంగా పెరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 7.4 లక్షల కోట్లు కాగా... 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 14.12 లక్షల కోట్లకు చేరాయి. అంటే, ఆరేళ్ల వ్యవధిలోనే మొత్తం పన్ను వసూళ్లు రెట్టింపు పైగా పెరిగాయి.