తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ తర్వాత చదువు మానేసే వారి సంఖ్య బాగా తగ్గిందని సీఎం జగన్ చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే వారి సంఖ్య గతంలో 37 లక్షలుగా ఉంటే, తాము అధికారంలోకి వచ్చాక మార్పు చేసిన విధానాల వల్ల, ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో చదివేవారి సంఖ్య 40 లక్షలకు పైగా విద్యార్థులు చేరారని అన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులు కోర్సు చదివేటప్పుడే ఇంటర్న్‌షిప్ కచ్చితంగా చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లుగా చెప్పారు. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం (ఏప్రిల్ 26) అనంతపురం జిల్లా నార్పలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దాదాపు 8 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ.912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేశారు.
పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువు అనే అస్త్రంతోనే సాధ్యమవుతుందని అన్నారు. చదువు అనేది ఓ కుటుంబ చరిత్రనే కాదని, ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుందని అన్నారు. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తాపత్రయంతోనే, ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా మార్పులు చేశామని అన్నారు. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు.