Mukesh Ambani Gift: మన దేశంలో, ప్రపంచంలోని పెద్ద వ్యాపార సంస్థల యజమానులు, కుబేరులు దానధర్మాలు చేయడం మామూలే. చట్ట ప్రకారం 'కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ' కింద కొంత, దీనికి అదనంగా మంచి మనస్సుతో మరికొంత మేర తమ ఆదాయాల నుంచి విరాళాలు ఇస్తుంటారు. ఆ విరాళాలను దాదాపుగా స్వచ్ఛంద సంస్థలకు ఇస్తుంటారు. కానీ, సొంత ఉద్యోగుల పట్ల ఔదార్యం చూపించే పారిశ్రామికవేత్తలు లేదా కుబేరులు అతి కొద్దిమంది మాత్రమే ఈ భూమ్మీద కనిపిస్తారు. వారిలో ముకేష్‌ అంబానీ (Mukesh Ambani) ఒకరు.


దీర్ఘకాల ఉద్యోగికి అతి భారీ గిఫ్ట్‌
మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఓనర్‌, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేష్‌ అంబానీ. తనకు భారీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మాత్రమే కాదు, అదే స్థాయిలో మంచి మనస్సు కూడా ఉందని కూడా చాటారు. అంబానీకి కుడి చేయిగా అందరూ పిలిచే దీర్ఘకాల ఉద్యోగికి మనోజ్ మోదీకి అతి పెద్ద బహుమతిని ఇవ్వడమే దీనికి నిదర్శనం. 


రిలయన్స్ జియో & రిలయన్స్‌ రిటైల్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్న మనోజ్‌ మోదీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో (RIL) దీర్ఘకాల ఉద్యోగి.  దేశంలోని అత్యంత విలువైన రిలయన్స్‌ కంపెనీలో మల్టీ-బిలియన్ డాలర్ల ఒప్పందాలు విజయవంతం కావడం వెనుక ఉన్న వ్యక్తిగా మోదీకి పేరుంది. ఆయన చేసిన సుదీర్ఘ, విజయవంతమైన సేవలకు గుర్తుగా బహుమతిగా 22 అంతస్తుల భవనాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌ అంబానీ బహూకరించారు. 


నేపియన్ సీ రోడ్‌లో ఉన్న నివాస ఆస్తి
ఎక్కడో ఎవరికీ తెలీని ప్రదేశంలో కాకుండా, ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన నేపియన్ సీ రోడ్‌లో (Mumbai Nepean Sea Road) ఉన్న ఆస్తిని మోదీకి అంబానీ రాసిచ్చారు. Magicbricks.com ప్రకారం, కొన్ని నెలల క్రితం ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. నేపియన్ సీ రోడ్‌లోని ఆ 22 అంతస్తుల భవనం పేరు 'బృందావన్'. JSW గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ‍‌(Sajjan Jindal) కూడా నేపియన్ సీ రోడ్‌లోని 'మహేశ్వరి' ఇంట్లో నివసిస్తున్నారు.


భవనం విలువ రూ.1500 కోట్లు
నేపియన్ సీ రోడ్‌లోని నివాస స్థలాల ధరలు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాయి. సాధారణంగా, ఒక చదరపు అడుగుకు రూ. 45,100 నుంచి రూ. 70,600 వరకు ధర పలుకుతాయి. మోదీ కొత్త ఎత్తైన భవనంలో 22 అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. భవనం మొత్తం వైశాల్యం 1.7 లక్షల చదరపు అడుగులు. ఈ లెక్క ప్రకారం... మనోజ్‌ మోదీకి ముకేష్‌ అంబానీ అప్పగించిన భవనం విలువ రూ. 1500 కోట్లు. 


Magicbricks.com ప్రకారం, ఈ 22 అంతస్తుల భవనంలోని మొదటి ఏడు అంతస్తులు కార్ పార్కింగ్ కోసం కేటాయించారు. ఈ ఇంటిని డిజైన్‌ చేసింది తలతి & పార్ట్‌నర్స్ LLP. ఇంటి ఫర్నీచర్‌లో కొన్నింటిని ఇటలీ నుంచి సేకరించారు. దీనిని బట్టి బిల్డింగ్‌ లగ్జరీని అంచనా వేయవచ్చు.


మనోజ్‌ మోదీ, ముంబైలో తనకు ఉన్న రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించారు. ఫ్లాట్ల ధర రూ.41.5 కోట్లు అని రిజిస్ట్రేషన్ పేపర్‌లో చూపించారు. ఆ రెండూ మహాలక్ష్మి ప్రాంతంలోని రహేజా వివేరియాలో ఉన్నాయి. వాటిలో ఒకటి 28వ అంతస్తులో ఉంది, దాని విస్తీర్ణం 2,597 చదరపు అడుగులు. మరొకటి అదే అపార్ట్‌మెంట్స్‌లోని 29వ అంతస్తులో ఉంది.