AP TS Hurun Rich List 2022: సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ రిచ్‌లిస్ట్‌-2022లో మెరుగైన ర్యాంకులు సాధించారు. మొత్తంగా 78 మంది తెలుగు బిలియనీర్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు. వీరి మొత్తం సంపద విలువ రూ.3,90,500 కోట్లుగా ఉంది.


హైదరాబాద్‌కు సంబంధించి ఎక్కువగా ఫార్మా వ్యాపారవేత్తలు ఉన్నారు. దివీస్‌ లెబొరేటరీస్‌ ప్రమోటర్‌ మురళీ దివి, ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద 29 శాతం తగ్గినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను మించిన కోటీశ్వరులు లేరు. 2021లో వారి సంపద రూ.79,000 కోట్లు కాగా ఇప్పుడు ర.56,200 కోట్లకు తగ్గింది. జాతీయ స్థాయిలో ఆయన 6 స్థానాలు తగ్గి 14వ ర్యాంకులో కొనసాగుతున్నారు.


హెటెరో గ్రూప్ అధినేత బి.పార్థసారథి రెడ్డి తెలుగు సంపన్నుల్లో రెండో స్థానంలో నిలిచారు. గతేడాది ఆయన సంపద రూ.26,100 కోట్లు కాగా ఈ సారి 50 శాతం వృద్ధితో రూ.39,200 కోట్లకు చేరుకున్నారు. జాతీయ స్థాయిలో ఆయన 58 నుంచి 32వ ర్యాంకుకు ఎగబాకారు. ఎంఎస్‌ఎన్‌ లెబొరేటరీస్‌ అధినేత ఎం.సత్యనారాయణ రెడ్డి రూ.16,000 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. గతేడాది ఆయన సంపద రూ.8700 కోట్లు ఉండగా ఈసారి 39 శాతం వృద్ధితో రూ.16,000 కోట్లకు చేరుకున్నారు. కొవిడ్‌19 సమయంలో ఎంఎస్‌ఎన్‌ ఫావిపిరవిర్‌ను తక్కువ రేటుకు విక్రయించిన సంగతి తెలిసిందే.


బయలాజికల్‌ ఈ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్లా రూ.8700 కోట్ల (13% పెరుగుదల)తో టాప్‌-10లో నిలిచారు. ఈ జాబితాలో టాప్‌-10లో ఉన్న ఏకైక మహిళ ఆమే కావడం గమనార్హం. మొత్తంగా అగ్రశ్రేణి పది మందిలో ఆరుగురు ఫార్మా పరిశ్రమకు చెందినవారే. రూ.11,300 కోట్లతో కే.సతీశ్‌ రెడ్డి-డాక్టర్‌ రెడ్డీస్‌ కుటుంబం, రూ.9000 కోట్లతో సువెన్‌ ఫార్మా జాస్తి వెంకటేశ్వర్లు - కుటుంబం వరుసగా 8, 9 స్థానాల్లో నిలిచారు. మౌలిక నిర్మాణ సంస్థ జీఏఆర్‌ గ్రూప్స్‌, అమరేందర్‌ రెడ్డి (రూ.15000 కోట్లు), మై హోం జూపల్లి రామేశ్వర రావ్‌ (రూ.13,300 కోట్లు), మేఘ ఇంజినీరింగ్ పి.పిచ్చిరెడ్డి (రూ.12,600 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ.12,100 కోట్లు) వరుసగా 4 నుంచి 7 స్థానాల్లో ఉన్నారు.


ఈ ఏడాది దివీస్‌, జూపల్లి, సతీశ్‌ రెడ్డి, జాస్తి సంపద తగ్గగా మిగిలిన ఆరుగురి నెట్‌వర్త్‌ పెరిగింది. మొత్తంగా తెలుగువారిలో 11 మంది యూఎస్‌ డాలర్‌ బిలియనీర్లు కావడం గమనార్హం. హైదరాబాద్‌ నుంచి 69 మంది సంపన్నులు ఉన్నారు. 2021లో వీరి సంఖ్య 56 మాత్రమే. ఇక విశాఖ నుంచి ఐదుగురు (ఫిషరీస్‌ రంగం), విజయవాడ నుంచి ఒకరు ఉన్నారు.


తిరుగులేని అదానీ


సంపద సృష్టిలో గౌతమ్‌ అదానీకి తిరుగులేదు! గతేడాది నుంచి ఆయన ఇంట్లో కనక వర్షం కురుస్తూనే ఉంది. ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ రిచ్‌ లిస్టులో ఇప్పటికే ఆయన ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. తాజాగా ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022లోనూ ఆయన రికార్డులు సృష్టించారు. భారత్‌లో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఏడాది నుంచి ఆయన రోజుకు రూ.1612 కోట్లు ఆర్జిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని రెండో స్థానానికి నెట్టేశారు.


ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం గౌతమ్‌ అదానీ సంపద ఇప్పుడు రూ.10,94,400 కోట్లకు చేరుకుంది. ముకేశ్‌ అంబానీ కన్నా రూ.3 లక్షల కోట్లు ఎక్కువగా ఉన్నారు. హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ వృద్ధిరేటు మొత్తంగా 9 శాతం ఉండగా అదానీని తొలగించి చూస్తే కేవలం 2.67 శాతానికే  పరిమితమవ్వడం గమనార్హం. ఒకప్పుడు కమోడిటీ వ్యాపారం చేసే గౌతమ్‌ అదానీ ఇప్పుడు బొగ్గు గనులు, ఎగుమతులు, పోర్టులు, ఇంధనం సహా అనేక వ్యాపారాలను విస్తరించారు. ఆయనకున్న ఏడు కంపెనీల్లో ప్రతి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లకు పైగానే ఉండటం ప్రత్యేకం.