Tata Group Merger Plan: టాటా గ్రూప్ తన ఎయిర్‌లైన్ కంపెనీలన్నింటినీ ఒకే గొడుకు (బ్రాండ్‌) కిందకు తేవాలని చూస్తోంది. ఎయిరిండియా బ్రాండ్‌తోనే ఎయిర్‌ సర్వీసులన్నీ అందించాలని భావిస్తోంది. అయితే, టాటా గ్రూప్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు.


2024 నాటికి ఎయిర్‌లైన్ వ్యాపారం విలీనం మొత్తం పూర్తి కావాలని గడువు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద టాటా గ్రూప్‌లోని వివిధ స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయట. మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


12 నెలల్లో విలీనం
ఎయిర్‌ ఏషియా ఇండియాలోని (AirAsia India) తన ఓనర్‌షిప్‌ను ఎయిర్‌ ఇండియాకు (Air India) బదిలీ చేయడం ద్వారా త్వరలోనే ఈ ప్లాన్‌ ప్రారంభమవుతుంది. వచ్చే 12 నెలల్లో విలీనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌ ఏసియా ఇండియాలో టాటా సన్స్‌కు (Tata Sons) మెజారిటీ వాటా ఉంది.


 సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు వాటా
ఈ విలీనం పూర్తయిన తర్వాత విస్తారా విషయానికి వస్తారు. విస్తారాలో కొంత స్టేక్‌ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు (SIA) ఉంది. వాళ్లతో మాట్లాడి, ఎయిర్ ఇండియా-విస్తారా విలీనాన్ని పూర్తి చేస్తారు. వీళ్లకు ఎయిర్ ఇండియాలో వాటా ఇస్తారు.


ఈ సంవత్సరం ప్రారంభంలో, భారత ప్రభుత్వం నుంచి రూ.18,000 కోట్ల వ్యయంతో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఎయిర్ ఇండియా పూర్తి యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఈ కొనుగోలులో భాగంగా చేజిక్కించుకుంది. ఎయిర్‌ ఏషియా ఇండియాలో 83.67 శాతం యాజమాన్యం, విస్తారాలో 51 శాతం వాటా టాటా గ్రూప్‌నకు ఉంది. విస్తారాలో మిగిలిన 49 శాతం వాటా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ది.


ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా విలీనానికి సంబంధించి, మొదట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ప్యాసింజర్ బుకింగ్ సిస్టమ్‌ను ఏకీకృతం చేస్తారు. దీంతో, మెర్జర్‌ ప్రాసెస్‌ మొదలైందని భావించవచ్చు.


చాలా సంక్లిష్టతలు
ప్రస్తుతానికి, రెండు విమానయాన సంస్థల సేవలు, సిబ్బంది డ్రెస్‌ కోడ్‌, ఇంకా చాలా విషయాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ సంక్లిష్టతలను సరళీకరించి, వ్యవస్థ మొత్తం ఒకేలా ఉండేలా చూసేందుకు ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. 


విలీనం తర్వాత ఏర్పడే ఎయిర్‌లైన్అప్పుడు రెండు రకాల విమాన సర్వీసులు నడుపుతుంది. అవి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737, ఎయిర్ ఏషియాకు చెందిన ఎయిర్‌బస్ 320. ఎయిర్ ఏషియా ఇండియాలో ఉన్న అన్ని విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు మార్చే యోచనలో ఉన్నారు. 


పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే వరకు AOPని (ఫ్లయింగ్ పర్మిట్) చెల్లుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ను నిర్వహించడం ద్వారా, ఎయిర్‌ ఏషియా ఇండియా AOPని చెల్లుబాటులో ఉంచడం గురించి కూడా టాటా గ్రూప్‌లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎయిర్‌ ఇండియాను స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది ఆలోచనల రూపంలోనే ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ కథనం ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు గానీ, పర్యవసానాలకు గానీ ఏబీపీ దేశం బాధ్యత వహించదు.