ICICI Bank Q2 Result: దేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ రుణదాత ICICI బ్యాంక్, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (Q2FY23) ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. బ్యాడ్ లోన్ల కేటాయింపుల్లో (Provisions) గణనీయమైన తగ్గుదలను, స్వతంత్ర (Standalone) నికర లాభంలో 37 శాతం వార్షిక (YoY) వృద్ధిని, నికర వడ్డీ ఆదాయంలో 26.5 శాతం పెరుగుదలను సాధించింది.


ఆకర్షణీయంగా నికర లాభం
సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్టాండ్‌లోన్ లాభం రూ.7,557.84 కోట్లకు ఎగబాకింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.5,511 కోట్ల నుంచి ఇది పెరిగింది.


ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 14,787 కోట్లుగా లెక్క తేలింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ. 11,690 కోట్లతో పోలిస్తే, నికర వడ్డీ మార్జిన్ సీక్వెన్షియల్ (QoQ) & ఇయర్‌ ఆన్ ఇయర్ (YoY) ప్రాతిపదికన దాదాపు 30 బేసిస్‌ పాయిట్లు (bps) లేదా 0.3 శాతం పెరిగి 4.31 శాతానికి చేరింది. వడ్డీయేతర ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 5,139 కోట్లకు చేరింది.


రుణ వృద్ధి
ఏడాది ప్రాతిపదికన... మొత్తం లోన్‌ పోర్ట్‌ఫోలియో 23 శాతం పెరిగింది. దేశీయ రుణాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది. సగటు కరెంట్ ఖాతా - పొదుపు ఖాతా (CASA - కాసా) నిష్పత్తి 45 శాతం. దీంతో, 'పీరియడ్ ఎండ్' డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ. 10.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రిటైల్‌ విభాగంలో 25 శాతం, వ్యాపార బ్యాంకింగ్‌లో 43 శాతం, రూ.250 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సంస్థల విభాగంలో 27 శాతం, హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో 23 శాతం చొప్పున రుణ వృద్ధి కనిపించింది.


బ్యాడ్‌ లోన్లు, ఆకస్మిక వ్యయాల నుంచి రక్షణ కోసం ముందస్తుగా చేసే కేటాయింపులు గత ఏడాదిలోని రూ. 2,713.48 కోట్ల నుంచి ఈసారి రూ. 1,644.52 కోట్లకు తగ్గాయి. ఇదే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటి రూ. 1,143.82 కోట్లతో పోలిస్తే మాత్రం పెరిగాయి.


సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొత్తగా రూ. 4,300 కోట్ల రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. తొలి త్రైమాసికంలోని స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (GNPAs) 3.41 శాతం నుంచి ఇప్పుడు 3.19 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం త్రైమాసికంలో నమోదైన 4.82 శాతంతో పోలిస్తే GNPAలు ఇప్పుడు బాగా తగ్గాయి.


శుక్రవారం, రూ.21.15 లేదా 2.38 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర, రూ.909.80 దగ్గర ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.