Refund To Home Buyers: ప్రతి వ్యక్తి జీవితంలో సొంత ఇల్లు అనేది అత్యంత కీలకమైన విషయం. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, ఒక కుటుంబం కష్టార్జితం. భారతీయుల విషయంలో సొంతిల్లు ఒక సెంటిమెంట్. ఇంటి ఇటుకల్లో ప్రేమ కూడా పెనవేసుకుని ఉంటుంది.
సొంతింటి కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే ఆశతో, జీవిత కాలం కష్టపడ్డ డబ్బును లేదా అప్పుగా తీసుకొచ్చిన డబ్బును బిల్డర్ చేతుల్లో పోస్తాం. కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ డెవలపర్లు మోసం చేస్తారు. ఇల్లు కట్టరు, డబ్బు తిరిగి ఇవ్వరు. ఈ తరహా అక్రమాలతో ఇబ్బంది పడుతున్న గృహ కొనుగోలుదార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై, డెవలపర్లు డిఫాల్ట్ అయితే, ఇంటి కొనుగోలుదార్లు తమ డబ్బును సులభంగా తిరిగి (Refund) పొందొచ్చు. దీనికి సంబంధించి, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల రెరాలకు (RERA - Real Estate Regulatory Authority) ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది.
గుజరాత్ మోడల్‌ను అనుసరించాలని సలహా
ET రిపోర్ట్ ప్రకారం, ఇంటి పెట్టుబడిదార్ల కోసం ఒక రికవరీ మెకానిజాన్ని రూపొందించాలని అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలను గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ (Ministry of Housing) కోరింది. కొత్త నిబంధనల రూపకల్పనలో గుజరాత్ రెరాను ఒక ఉదారహణగా చూపింది. గుజరాత్ రెరా తరహాలో రికవరీ యంత్రాంగాన్ని తీసుకురావాలని అన్ని రెరాలకు సూచించింది. రికవరీ అధికారిని నియమించాలని కూడా రెరాలకు చెప్పింది.
ఈ అడ్వైజరీని జారీ చేయడానికి ముందు... కొత్త రికవరీ యంత్రాంగం విషయంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల రెరాల నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖ సలహాలు, సూచనలు ఆహ్వానించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం కింద జారీ చేసిన రికవరీ ఆర్డర్‌లను ప్రభావవంతంగా & సకాలంలో అమలు చేసేలా మార్గాలు సూచించాలని ఆ ఆరు రెరాలను కోరింది. వెంటనే స్పందించిన తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర రెరాలు సలహాలు, సూచనలు పంపాయి.
సకాలంలో వాపసు అందుతుందనే ఆశ
తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర రెరాలు పంపిన సలహాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రెరాలకు అడ్వైజరీని జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలు గుజరాత్ రెరా నమూనాను అనుసరించాలని ఆ అడ్వైజరీలో కోరింది. ఇటీవల, కేంద్ర సలహా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. గుజరాత్ మోడల్‌ను అనుసరించడం గురించి మంత్రిత్వ శాఖ ఆ సమావేశంలో మాట్లాడింది.
ఒకవేళ రియల్ ఎస్టేట్ డెవలపర్ మోసం చేసినా/ డిఫాల్ట్ అయినా.. గుజరాత్ మోడల్ రికవరీ మెకానిజం వల్ల గృహ కొనుగోలుదార్లకు సకాలంలో వాపసు (Refund) అందుతుందని భావిస్తున్నారు.
ఇళ్ల కొనుగోలుదార్ల ఆందోళన ఇది
ఇప్పటి వరకు, రెరా ఆర్డర్ తర్వాత కూడా గృహ కొనుగోలుదార్లకు సకాలంలో డబ్బు అందడం లేదు. డెవలపర్లు ఆ డబ్బును తిరిగి చెల్లించడం లేదని మంత్రిత్వ శాఖకు చాలా ఫిర్యాదులు అందాయి. డెవలపర్లను గట్టిగా ఢీ కొట్టలేక దేశవ్యాప్తంగా ఇంటి కొనుగోలుదార్లు ఇబ్బందులు పడుతున్నారు. రికవరీ ఆర్డర్ తర్వాత కూడా డిఫాల్ట్ డెవలపర్ నుంచి రిఫండ్ పొందడంలో జాప్యం జరుగుతోందని మినిస్ట్రీ దృష్టికి వచ్చింది. ఈ సమస్య నుంచి తప్పించేందుకు గుజరాత్ మోడల్ రికవరీ మెకానిజం రూపొందించాలని అన్ని రెరాలను కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది.
మరో ఆసక్తికర కథనం: తక్కువ EMI ఆశలు ఆవిరి, ఆర్‌బీఐ దాస్ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే