NIA Raids in Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్ నగర్ (Himayathnagar)లోని వరవరరావు అల్లుడు, 'వీక్షణం' పత్రిక ఎడిటర్ గా ఉన్న ఎన్.వేణుగోపాల్ తో పాటు ఎల్బీనగర్ లోని రవిశర్మ, అనురాధ దంపతుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వేణు ఇంట్లో దాదాపు 5 గంటల పాటు తనిఖీలు చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశర్మ సెల్ ఫోన్, పాత పుస్తకాలు, పాత కరపత్రాలు సీజ్ చేశారు. ఈ నెల 10న విచారణకు రావాలని ఆదేశించారు. కాగా, ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ ను కూకట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద దొరికిన సమాచారం ఆధారంగా వేణు నివాసంలో సోదాలు చేసినట్లు సమాచారం. గతంలోనూ వీరి ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. పత్రిక ప్రకటన ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
వేణు ఏమన్నారంటే.?
మరోవైపు, గురువారం ఉదయం 5 గంటలకు ఎన్ఐఏ అధికారులు తమ ఇంటికి వచ్చారని జర్నలిస్ట్ వేణు తెలిపారు. సెర్చ్ వారెంట్ తో వచ్చామని వారు చెప్పినట్లు వివరించారు. 2013లో నయీమ్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశానని.. ఆ పుస్తకాలను తీసుకెళ్లారని చెప్పారు. తన మొబైల్ సీజ్ చేశారని అన్నారు. ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ కు, తనకు సంబంధం ఉందని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసుపై గత ప్రభుత్వంలోని సీఎంకు లేఖ రాశానని పేర్కొన్నారు. తాను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యిందని వెల్లడించారు. దేశంలో ఎన్ఐఏ ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, జనవరి 3న తనపై పెట్టిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసుకుందని వివరించారు. ఈ కేసులో తన పేరును ఏ - 22గా చేర్చారని.. తాను ఓ మాస పత్రికను నడుపుతున్నానని చెప్పారు. తాను 'విరసం'లో ప్రస్తుతం లేనని స్పష్టం చేశారు.
Also Read: Telangana Irrigation: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన - వారిని రాజీనామా చేయాలన్న మంత్రి