HDFC Bank Q1 Results: దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) శనివారం ఫలితాలు విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన 2022, జూన్ 30న ముగిసిన త్రైమాసికంలో రూ.9,195 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.7,729 కోట్లుగా ఉంది. గతేడాది రూ.36,771 కోట్లతో పోలిస్తే 13 శాతం వృద్ధిరేటుతో ఆదాయం రూ.41,560 కోట్లకు పెరిగింది. త్రైమాసికం ఆధారంగా చూస్తే రూ.10,055 కోట్ల నుంచి 8.9 శాతం తగ్గింది. రెవెన్యూ మాత్రం రూ.41,085 కోట్ల నుంచి పెరిగింది.


వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం పెరిగి రూ.19,481 కోట్లుగా ఉంది. అంతకు ముందే ఇదే త్రైమాసికంలో ఇది రూ.17,009 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆస్తుల్లో ప్రధాన వడ్డీ మార్జిన్‌ 4 శాతంగా ఉంది. వడ్డీయేతర ఆదాయం రూ.6,288 కోట్ల నుంచి రూ.9,011 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రీ ప్రావిజనింగ్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ 14.7 శాతం పెరిగి రూ.15,367 కోట్లుగా నమోదైంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2022, జూన్‌తో ముగిసిన క్వార్టర్లో రూ.3,187 కోట్లను అత్యవసర నిధిగా పక్కన పెట్టింది. గతేడాది రూ.4,830 కోట్లతో పోలిస్తే 34 శాతం తక్కువ. ఇక మార్చి త్రైమాసికంలో ఇది రూ.3,312 కోట్లు కావడం గమనార్హం. ఇక స్థూల నిరర్ధక ఆస్తులు 1.47 నుంచి 1.28 శాతానికి తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 0.32 శాతం ఎక్కువగానే ఉన్నాయి. నికర నిరర్ధక ఆస్తులు 0.48 నుంచి 0.35 శాతానికి తగ్గాయి. 


గత 12 నెలల్లో హెచ్‌డీఎఫ్‌సీకి 725 బ్రాంచులు ఉన్నాయి. 29,039 ఉద్యోగులు ఉన్నారు. చివరి త్రైమాసికంలో 36 బ్రాంచులు, 10,932 మంది ఉద్యోగులు పెరిగారు. హెచ్‌డీఎఫ్‌సీ షేరు ధర శుక్రవారం రూ.11 లాభపడి రూ.1362గా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.