HDFC Bank Alert: మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. ప్రజలు ఇంట్లోనే కూర్చొని నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా బ్యాంకింగ్‌ పూర్తి చేస్తున్నారు. అయితే, పెరుగుతున్న డిజిటల్ బ్యాంకింగ్ వినియోగంతోటే, సంబంధింత మోసాల కేసులు (Cyber Fraud) కూడా వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి ఖాదాదార్లను రక్షించడం కోసం అన్ని బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC Bank కూడా తన కస్టమర్లకు ఇలాంటి హెచ్చరిక (HDFC Bank Fraud Alert) జారీ చేసింది.


పాన్ కార్డ్ అప్‌డేట్, కేవైసీ అప్‌డేట్‌ అంటూ కొంతకాలంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు చాలా మెసేజ్‌లు అందుతున్నాయి. కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలో పాన్ కార్డ్ సమాచారాన్ని వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయకపోతే, వారి బ్యాంక్ ఖాతా సస్పెండ్ అవుతుందని HDFC బ్యాంక్ పేరుతో వచ్చిన సందేశాల్లో ఉంటోంది. KYCని కూడా అప్‌డేట్ చేయమని కస్టమర్లను కోరుతున్నారు. ఈ అప్‌డేషన్‌ల కోసం లింక్‌లు కూడా పంపుతున్నారు. ఆ లింక్‌ మీద క్లిక్ చేయడం ద్వారా మొత్తం సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చని సందేశాల్లో సూచిస్తున్నారు. 


ఆ తరహా మెసేజ్‌లపై స్పందించిన బ్యాంక్, అవన్నీ ఫేక్ మెసేజ్‌లని తెలిపింది. అలాంటి సందేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఖాతాదార్లకు సూచించింది. ఎవరైనా ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అతని ఫోన్ హ్యాక్ అవుతుందని, బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.






సైబర్ మోసం నుంచి తప్పించుకోవడం ఎలా?
ఈ రకమైన సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండటానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్‌లకు కొన్ని చిట్కాలను అందించింది. అందులో మొదటి విషయం.. మీకు ఏదైనా సందేశం వచ్చినట్లయితే, ముందుగా, ఆ సందేశంలో ఉన్న డొమైన్ లింక్ ఏమిటో తనిఖీ చేయండి. మీరు దాని సోర్స్‌ను సరిగ్గా కనుగొనలేకపోతే, ఆ లింక్‌పై క్లిక్ చేయకుండా ఉండాలి. ఒకవేళ పొరపాటున ఆ లింక్‌ మీద క్లిక్ చేసినా, మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు అని హెచ్చరించింది.


1. మీకు ఏదైనా సందేశం వస్తే, దాని URL చెక్‌ చేయండి.
2. బ్యాంక్‌ అధికారిక పేజీలో మాత్రమే మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయండి.
3. మీరు మీ నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేస్తున్న పేజీ అడ్రస్‌ బార్‌లో https:// ఉండాలి. ఇందులో 's' అంటే సేఫ్‌ అని అర్ధం. 
4. URL అడ్రస్‌ https:// తో ప్రారంభం కాకపోతే, మీకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే ముందు జాగ్రత్త వహించండి.
5. ఏదైనా కాల్ లేదా మెసేజ్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని చెప్పే ముందు, మీ అభ్యర్థిస్తేనే ఆ కాల్ లేదా సందేశం వచ్చిందా, లేదా అన్నది చూసుకోండి. 
6. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్‌లోని నంబర్‌ను క్రాస్ చెక్ చేయండి.
7. మీ కంప్యూటర్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండండి.
8. మీ క్రెడిట్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండండి.
8. ఈ-మెయిల్ లేదా మెసేజ్ ద్వారా పాన్ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంక్ మీకు సలహా ఇవ్వదని గుర్తుంచుకోండి.
9. మీరు ఏదైనా కాల్ లేదా సందేశాన్ని అనుమానించినట్లయితే, బ్యాంకుకు కాల్ చేయడం ద్వారా వెంటనే క్రాస్ వెరిఫై చేయండి.