ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అంతర్జాతీయంగా ఈ సినిమాకు వరుస ప్రశంసలు దక్కడమే కాకుండా వరుసగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ సినిమాకు ఇంటర్నేషనల్ గా అవార్డులు వస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుల నామినేషన్ లో ఎంపిక అయింది. దీంతో ఈ పాట పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నాటు నాటు’ మోత మోగుతూనే ఉంది. అంతలా ఈ పాట క్రేజ్ ను సంపాదించుకుంది. తాజాగా ఈ పాటను దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్ ‘బిటిఎస్’ సింగర్ జంగ్ కుక్ ఏంజాయ్ చేస్తూ కనిపించారు. తన సీటు లో కూర్చొని పాటను ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియో చూసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ దీనిపై స్పందించింది. ‘‘జంగ్ ఈ పాటను ఇంతగా ఇష్టపడటం, ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మీ బీటిఎస్ బృందం దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’’ అంటూ స్పందించింది టీమ్. ‘బీటిఎస్’ అనేది దక్షిణ కొరియాకు చెందిన మ్యూజిక్ బ్యాండ్. జంగ్ కుక్, ఆర్ ఎం, వి, జిమిన్, జిన్, జె.హోప్, సుగా తో కలసి ఏడుగురు బృందంతో ఈ బ్యాండ్ నిర్వహిస్తున్నారు. వీరి బ్యాండ్ కు అక్కడ మంచి పాపులారిటీ ఉంది. ఇక వీరి బ్యాండ్ నుంచి వచ్చిన ‘ఫేక్ లవ్’, ‘బాయ్ విత్ లవ్’, ‘బటర్’ వంటి పాటలకు ప్రేక్షకాదరణ పొందాయి.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ బృందం అమెరికా పర్యటనలో బిజీ గా గడుపుతోంది. తాజాగా ఈ టీమ్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరారు. ఇక మార్చి 13 న అమెరికాలో జరగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ‘నాటు నాటు’ పాటను లైవ్ లో ప్రదర్శించనున్నారు మూవీ టీమ్. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలసి అంతర్జాతీయ వేదికపై స్టెప్పులేయనున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, హెచ్సీఏ వంటి అవార్డులు అందుకున్న నేపథ్యంలో ఈ ‘నాటు నాటు’ పాటకు కూడా ఆస్కార్ అవార్డు వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ అమెరికా పర్యటనలో భాగంగా పలు అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఆయనకు స్పాట్ లైట్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. అజయ్ దేవ్ గన్, శ్రియ శరన్, సముద్రఖని ప్రత్యేక పాత్రల్లో నటించగా అలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
Also Read : వెంకటేష్ మహా రాజేసిన రగడ - 'కెజియఫ్' ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన మిగతా ముగ్గురు