Greater Visakhapatnam Municipal Bonds: లోక్‌సభ ఎన్నికల ముందు కొద్దిగా మందగించిన బాండ్‌ మార్కెట్‌, ఇప్పుడు మళ్లీ రైజింగ్‌లో ఉంది. నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్లను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (Greater Visakhapatnam Municipal Corporation - GVMC) కూడా ఈ లిస్ట్‌లో ఉంది.


నిధుల సేకరణ సిద్ధమైన మున్సిపల్ కార్పొరేషన్లు
విశాఖపట్నంతో పాటు నాసిక్, కాన్పూర్, సూరత్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి 6 పెద్ద నగరాల సివిక్‌ బాడీలు బాండ్ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాయి. ఇవన్నీ.. మునిసిపల్‌ బాండ్లు జారీ చేసి డబ్బు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని జాతీయ మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. ఈ మునిసిపల్ బాడీలు వచ్చే నెల (జులై 2024) చివరిలోగా మునిసిపల్‌ బాండ్లను జారీ చేయవచ్చు. దీనర్ధం... వచ్చే నెలన్నర రోజులు బాండ్ మార్కెట్‌లో చాలా బిజీని మనం చూడబోతున్నాం. రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే... బాండ్ల జారీ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్లు 100 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు సేకరించే ఛాన్స్‌ ఉంది. 


పెట్టుబడి పెట్టే వాళ్లకు మంచి రాబడి
బాండ్ల జారీని సింపుల్‌గా చెప్పాలంటే... మునిసిపల్‌ సంస్థలు పెట్టుబడిదార్ల నుంచి అప్పు తీసుకుంటాయి, ఆ మొత్తాన్ని నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి చెల్లిస్తాయి. బాండ్లు కొనేవాళ్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను మునిసిపల్ కార్పొరేషన్లు ఆఫర్‌ చేయబోతున్నట్లు సమాచారం. బాండ్ ఇష్యూలపై పెట్టుబడిదార్లకు 7.9 శాతం నుంచి 8.3 శాతం వరకు వడ్డీ ‍‌(Coupon Rate) లభించొచ్చు.


మున్సిపల్ సంస్థలు బాండ్లను ఎందుకు జారీ చేస్తాయి?
మునిసిపల్ కార్పొరేషన్లకు చాలా బాధ్యతలు ఉంటాయి. నగరాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించడానికి, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మునిపల్ కార్పొరేషన్లకు డబ్బు కావాలి. బాండ్ల జారీ ద్వారా ఆ డబ్బును సమీకరించడం వాటి ముందున్న మార్గాల్లో ఒకటి. 


హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కూడా..
గతంలో, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కూడా బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించింది. దీంతోపాటు... అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్, పుణె, లఖ్‌నవూ మునిసిపల్ బాడీలు కూడా 2017 నుంచి 2024 మార్చి మధ్యకాలంలో బాండ్లను ఇష్యూ చేశాయి. ఈ 6 మునిసిపల్ సంస్థలు కలిసి, ఈ ఏడేళ్లలో సుమారు రూ.3,000 కోట్లు సమీకరించాయి. ఇటీవల, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కూడా 'సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్‌'లను జారీ చేసి రూ.100 కోట్లు సేకరించింది. ఈ డబ్బును మంచినీటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగిస్తుంది.


రిటైల్ ఇన్వెస్టర్లకు అవకాశం ఉందా?
ప్రస్తుతం, మునిసిపల్ కార్పొరేషన్లు ప్రారంభించే మునిసిపల్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి సంస్థాగత పెట్టుబడిదార్లకు మాత్రమే అనుమతి ఉంది. రిటైల్ పెట్టుబడిదార్లకు కూడా అవకాశం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ దిశలో, గత సంవత్సరం విడుదలైన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్లు మొట్టమొదటివి. సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చిన ఆ ఇష్యూలో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.244 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా డబ్బును పెట్టుబడి పెట్టిన మొదటి మునిసిపల్‌ బాండ్‌ ఇష్యూ అదే.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎక్కువ రాబడి కోసం మీకు కావాలి స్పెషల్‌ ఎఫ్‌డీలు - అదిరిపోయే ఆఫర్లు ఇవిగో