Sunita Williams Dances At Space Station:
భారత సంతతికి చెందన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లోకి అడుగు పెట్టారు. నాసాకి చెందిన Boeing Starliner స్పేస్‌క్రాఫ్ట్‌లో ఆమెతో పాటు బచ్ విల్మోర్ (Butch Wilmore) ISS లోకి వెళ్లారు. ఈ స్టార్‌లైనర్ ప్రాజెక్ట్‌లో తొలిసారి మానవసహిత యాత్ర చేపట్టగా అందులో ప్రయాణించిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించారు సునీతా. అంతకు ముందు రెండు సార్లు అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లిన ఆమె ఓ సారి వినాయకుడి ప్రతిమని, ఆ తరవాత భగవద్గీతను తీసుకెళ్లారు. వరుసగా ఇప్పుడు మూడోసారి ఆమె అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఆమె రాకతో స్పేస్ స్టేషన్ వద్ద సందడి నెలకొంది. తోటి వ్యోమగాములు ఆమెకి ఘన స్వాగతం పలికారు. గంట కొట్టి ఆహ్వానం అందించారు. ఆ సమయంలోనే సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేశారు. అక్కడ ఉన్న వ్యోమగాముల్ని ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇలాగే ఆడుతూ పాడుతూ ఇక్కడ పనులు చేయాలి" అని చాలా ఆనందంగా చెప్పారు సునీతా విలియమ్స్. తోటి ఆస్ట్రోనాట్స్ అంతా తనకు కుటుంబ సభ్యుల లాంటి వాళ్లేనని వెల్లడించారు.
ఫ్లోరిడాలోని Cape Canaveral Space Force Station నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ని లాంఛ్ చేశారు. సరిగ్గా 26 గంటల తరవాత అది ISSకి చేరుకుంది. ఈ క్రమంలోనే స్టార్‌లైనర్ ఎలా ప్రయాణించిందో సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ పరిశీలించారు. ఆర్బిటింగ్ ల్యాబొరేటరీకి చేరుకోడంలో కాస్త ఆలస్యమైంది. హీలియం లీక్స్ కారణంగా దాదాపు ఓ గంటపాటు జాప్యం జరిగింది. ఆ తరవాత ఇద్దరూ విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే మాన్యువల్‌గా స్టార్‌లైనర్‌ని తొలిసారి అంతరిక్షంలో నడిపారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండి నాసా చేపట్టే రకరకాల ప్రయోగాలకు సంబంధించిన పరిశోధనలు జరపనున్నారు. స్పేస్‌క్రాఫ్ట్‌లోకి వెళ్లక ముందు తాను కాస్త అసహనానికి లోనయ్యాయని చెప్పారు సునీతా విలియమ్స్. అంతరిక్ష కేంద్రానికి ఎప్పుడు వచ్చినా సొంతింటికి వచ్చిట్టే అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.