Special Fixed Deposit Schemes Of Various Banks: మన దేశంలోని సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. ప్రజలు బంగారం తర్వాత ఎక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టేది ఇక్కడే. ఒక ఎఫ్‌డీ వేసి వదిలేస్తే కాలంతో పాటు అదే పెరుగుతుంది. మెచ్యూరిటీ టైమ్‌కు మంచి మొత్తాన్ని చేతికి ఇస్తుంది. 


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో స్పెషల్‌ స్కీమ్‌లు ఉంటాయి. వీటి నియమ, నిబంధనలన్నీ సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల తరహాలోనే ఉన్నుప్పటికీ, మెచ్యూరిటీ టైమ్‌ పిరియడ్‌ & వడ్డీ రేటు మాత్రం భిన్నంగా ఉంటాయి. సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాగా స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అన్ని వేళలా ఓపెన్‌గా ఉండవు. వీటిలో పెట్టుబడి పెట్టడానికి కాల గడువు (Last Date) ఉంటుంది. ఆ గడువులోగా పెట్టుబడి పెడితేనే ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ఈ స్పెషల్‌ స్కీమ్‌లను ప్రవేశపెడతాయి. ప్రస్తుతం, వివిధ బ్యాంక్‌లు వివిధ రకాల ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను అమలు చేస్తున్నాయి. 


స్టేట్‌ బ్యాంక్‌ అమృత్‌ కలశ్‌ (SBI Amrit Kalash Scheme‌) 
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ గడువును SBI మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే, ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ఓపెన్‌ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఉంది. SBI అమృత్‌ కలశ్‌ మెచ్యూరిటీ వ్యవధి 400 రోజులు. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో డబ్బు జమ చేసిన సీనియర్‌ సిటిజన్లకు ఏటా 7.60 శాతం వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate) అందుతుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.10 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే అకౌంట్‌ను క్లోజ్‌ చేసే (Amrit Kalash premature withdrawal) సదుపాయం ఉంది. ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్‌ లోన్‌ కూడా వస్తుంది. మీకు పెట్టుబడి ఆలోచన ఉంటే.. నేరుగా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్ ఓపెన్‌ చేయవచ్చు. లేదా.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యోనో (SBI YONO) యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ ఖాతా ప్రారంభించొచ్చు.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 666 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం (Bank of India 666 Days Fixed Deposit Scheme)
పేరుకు తగ్గట్లే ఇది 666 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ‍‌పథకం. ఈ పథకంలో సూపర్ సీనియర్ సిటిజన్‌లు 7.95 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్‌లు 7.80 శాతం వడ్డీని, సాధారణ కస్టమర్లు 7.30 శాతం వడ్డీని అందుకుంటారు. ఈ స్కీమ్‌ కింద ఖాతాదార్లకు బ్యాంక్‌ లోన్‌ ‍‌(Loan facility on 666 days FD scheme) కూడా వస్తుంది. ఈ పథకం ఈ నెల ప్రారంభం (01 జూన్ 2024) నుంచి అమలులోకి వచ్చింది.


ఐడీబీఐ బ్యాంక్‌ ఉత్సవ్‌ ఎఫ్‌డీ (IDBI Bank Utsav FD) 
ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కాల వ్యవధి 300 రోజులు. ఐడీబీఐ బ్యాంక్‌ ఉత్సవ్‌ FDలో పెట్టుబడి పెట్టిన సాధారణ ప్రజలకు 7.05 శాతం & సీనియర్‌ సిటిజన్లకు మరో అర శాతం అధిక వడ్డీ రేటును (7.55 శాతం) బ్యాంక్‌ చెల్లిస్తుంది. అంతేకాదు... 375 రోజుల టెన్యూర్‌ ఉన్న FDపై సాధారణ ప్రజలకు 7.1 శాతం, 444 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.2 శాతం వడ్డీని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు స్కీమ్‌ల్లోనూ సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) 0.50% అధిక వడ్డీ లభిస్తుంది.


ఇండియన్‌ బ్యాంక్‌ ఇండ్‌ సుప్రీం 300 డేస్‌ ఎఫ్‌డీ (Indian Bank IND Supreme 300 DAYS)
ఇది 300 రోజుల టెన్యూర్‌ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే.. సాధారణ ఖాతాదార్లకు 7.05 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు (80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి) 7.80 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది. 400 రోజుల డిపాజిట్‌ స్కీమ్‌ను ‍‌(Ind Super 400 Days FD) కూడా ఇండియన్‌ బ్యాంక్‌ రన్‌ చేస్తోంది. ఈ కాల వ్యవధిలో సాధారణ ఖాతాదార్లకు 7.25 శాతం, సీనియర్‌ సిటినజన్లకు 7.75 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం చొప్పున వడ్డీని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 


పైన చెప్పిన పథకాలన్నీ రిటైల్‌ ఎఫ్‌డీలు. అంటే, వాటిలో రూ.2 కోట్లకు మించకుండా డిపాజిట్‌ చేయాలి.


మరో ఆసక్తికర కథనం: రికార్డ్‌ స్థాయిలో ఎనిమిదోసారీ రెపో రేట్‌ స్థిరం - FDలకు లాభం, తగ్గని EMIల భారం