పెరుగుతున్న ఇంధన ధరలు తగ్గే దిశగా అడుగులు పడుతున్నాయా?  కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోనుందా? పెట్రో ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయా? వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ను తీసుకొస్తారా? చమురు వినియోగదారులపై కొంతైనా భారం తగ్గుతుందా? అంటే ఈనెల 17న జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల కోసం ఎదురు చూడాల్సిందే!


జీఎస్‌టీపై ఏర్పాటైన మంత్రుల కమిటీ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా వస్తువులు/ఉత్పత్తుల ధరలు, ప్రభుత్వ ఆదాయంలో భారీ మార్పులకు తలుపులు తెరుస్తారని సమాచారం.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని ఈ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది.  సుప్రీం కోర్టు సూచనల మేరకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చిస్తారని తెలిసింది. అయితే సమావేశం అజెండాను బహిర్గతం చేయొద్దని వారు కోరినట్టు సమాచారం. దీనిపై ప్రశ్నించగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.


జీఎస్‌టీ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కమిటీలోని మూడోవంతు మంది ఆమోదం అవసరం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల్లోని ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని కేంద్ర మంత్రులు అప్పుడప్పుడు మీడియాతో అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే అంగీకరించడం లేదని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరు కావడంతో కేంద్ర పరిధిలోకి దీనిని తీసుకొచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి.


పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రజలు చేస్తున్న డిమాండ్లపై ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతోంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని వినియోగదారులు హాహాకారాలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా.. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు వరుస పెట్టి పన్నులు, సుంకాలు వేస్తుండటంతో వీటి ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి.


ఇక శుక్రవారం నాటి సమావేశంలో కొవిడ్‌కు ఉపయోగిస్తున్న కొన్ని రకాల ఔషధాలపై రాయితీలు కొనసాగించేందుకు జీఎస్‌టీ కమిటీ మొగ్గు చూపనుందని తెలిసింది. డిసెంబర్‌ 31 వరకు వీటిని కొనసాగిస్తారని సమాచారం. వచ్చే ఏడాది తర్వాతా రాష్ట్రాలకు జీఎస్‌టీ నష్టాలకు పరిహారం చెల్లించే అవకాశాలను పరిశీలించనుంది.


పునరుత్పాదక ఉత్పత్తులపై జీఎస్‌టీని 12 శాతానికి, ఐరన్‌, కాపర్‌, ఇతర లోహాలు, ముడి ఖనిజాలపై పన్నును 18 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయి.