GST Collection August: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లలో దేశం రికార్డులు సృష్టిస్తోంది! వరుసగా ఆరో నెల జీఎస్‌టీ రాబడి రూ.1.4 లక్షల కోట్లు దాటేసింది. వార్షిక ప్రతిపాదికన ఆగస్టులో జీఎస్టీ రాబడి 28 శాతం వృద్ధి చెంది రూ.1,43,612 కోట్లుగా నమోదైంది.
ఇందులో సీజీఎస్‌టీ రూ.24,710 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.30,951 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.77,782 కోట్లుగా ఉన్నాయి. ఐజీఎస్‌టీలోనే దిగుమతులపై వేసిన పన్ను రూ.42,067 కోట్లు కావడం గమనార్హం. ఇక సెస్ రూపంలో రూ.10,168 కోట్లు (దిగుమతులపై రూ.1018 కోట్లు) వచ్చాయి. గతేడాది ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,12,020 కోట్లు కాగా ఈ సారి 28 శాతం ఎక్కువ రాబడి వచ్చింది.
'గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 2022, ఆగస్టు నాటికి జీఎస్‌టీ రాబడి వృద్ధిరేటు 33 శాతంగా ఉంది. వరుసగా ఇదే స్థాయిలో వసూళ్లు ఉండటం సానుకూల అంశం. పన్ను అమలుకు గతంలో జీఎస్‌టీ మండలి తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీకి తోడుగా పన్నులు చెల్లిస్తుండటం నిలకడైన జీఎస్‌టీ రాబడిపై సానుకూల ప్రభావం చూపాయి' అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆగస్టులో ఐజీఎస్‌టీ నుంచి రూ.29,524 కోట్లను సీజీఎస్‌టీ, రూ.25,119 కోట్లను ఎస్‌జీఎస్‌టీకి సెటిల్ చేశారు. ఎప్పట్లాగే పన్నులను పంచుకోగా 2022, ఆగస్టులో కేంద్రానికి రూ.54,234 కోట్లు, రాష్ట్రాలకు రూ.56,079 కోట్ల రాబడి వచ్చింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ నెలలో దిగుమతులపై ఆదాయం 57 శాతం, స్థానిక లావాదేవీల ఆదాయం 19 శాతం అధికంగా పెరిగాయి.
జీడీపీ పరుగు
India Q1 GDP: భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ సూపర్ ఫాస్ట్ వేగం అందుకుంది. ఈ ఏడాదిలో ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, కమోడిటీ ధరలు తగ్గడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగవ్వడంతో దేశ జీడీపీ భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ రెండంకెల వృద్ధిరేటు 13.5 శాతం నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాయిటర్స్, ఇతర సంస్థలు అంచనా వేసిన 15.2 శాతం కన్నా కొద్దిగా తగ్గింది. అయితే చివరి త్రైమాసికంలోని 4.1% వృద్ధిరేటుతో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగైంది.
ప్రైవేటు వినియోగం పెరగడం జీడీపీ వృద్ధిరేటు పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొవిడ్1-19 భయాలు తగ్గిపోవడంతో తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ జోరు పెరిగింది. అంతకు ముందు డెల్టా వేవ్‌తో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్లు అమలు చేయడం, ఆంక్షలు విధించడంతో డిమాండ్, వినియోగం తగ్గిన సంగతి తెలిసిందే.
గత ఆర్థిక ఏడాదిత తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం వృద్ధిరేటుతో పయనించింది. అయితే కొవిడ్-19 మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ 23.8 శాతం కుంచించుకుపోవడంతో వృద్ధిరేటు తగ్గిపోయింది. లాక్‌డౌన్లతో వ్యాపారాలు మూసివేయడానికి తోడు లక్షల మందికి ఉపాధి కరవైంది. భారత్‌తో పోలిస్తే చైనా వృద్ధిరేటు మరింత కుంచించుకుపోయింది. జీరో కొవిడ్ పాలసీతో అక్కడి తయారీ కర్మాగారాలు మూతపడటమే ఇందుకు కారణం.