Challa Sreenivasulu Setty As SBI New Chairman: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పీఠంపై త్వరలో కొత్త వ్యక్తి కూర్చోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB), ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి (Challa Sreenivasulu Setty) పేరును సిఫార్సు చేసింది. చల్లా శ్రీనివాసులు శెట్టిని బ్యాంక్ వర్గాలు సీఎశ్ శెట్టి (CS Setty) అని పిలుస్తాయి.
చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) పదవిలో ఉన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం, 2020 జనవరిలో SBI MDగా నియమితులయ్యారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.
ఆగస్టులో ప్రస్తుత ఛైర్మన్ రిటైర్మెంట్
స్టేట్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్ దినేష్ ఖరా (Dinesh Khara) వయస్సు 63 సంవత్సరాలు. ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, బ్యాంక్ కొత్త చైర్మన్ నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికార్ల నియామకానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్ బ్యూరో (FSIB) బాధ్యత వహిస్తుంది. శనివారం, ముగ్గురిని ఇంటర్వ్యూ చేసిన FSIB, చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫార్సు చేసింది. SBI ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖరా పదవీకాలం ముగియకముందే, బ్యాంక్ కొత్త చైర్మన్ నియామకం కోసం CS శెట్టి పేరును సూచించింది.
చల్లా శ్రీనివాసులు శెట్టి ఎవరు?
ప్రస్తుతం ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా (MD) బాధ్యతలు నిర్వహిస్తున్న చల్లా శ్రీనివాసులు శెట్టి, 36 సంవత్సరాలకు పైగా బ్యాంక్ సర్వీస్‌లో ఉన్నారు. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలోకి వచ్చారు. నిజానికి, బ్యాంకర్ కావాలని శ్రీనివాసులు శెట్టి ప్లాన్ చేసుకోలేదట. IAS కావాలన్నది ఆయన టార్గెట్. తోటి వాళ్లు బ్యాంక్ ఉద్యోగాలకు రాస్తుంటే, CS శెట్టి కూడా పరీక్ష రాసి ఎంపికయ్యారు. అలా స్టేట్ బ్యాంక్ ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. సమాజానికి సేవ చేసే అవకాశం బ్యాంక్‌లోనూ ఉందని గ్రహించి, IAS కలను వదిలేసి, బ్యాంక్ ఉద్యోగంలోనే స్థిరపడ్డారు. ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు.
రిటైల్ బ్యాంకింగ్ & డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు బాడ్ లోన్ రికవరీలో చల్లా శ్రీనివాసులు శెట్టికి మంచి అనుభవం ఉంది. బ్యాంకు మొండి బకాయిల వసూళ్ల బాధ్యతను ఆయన తీసుకున్నారు. చాలా కాలంగా 'విదేశాల్లో ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నిర్వహణ' చూసుకున్నారు. నేపథ్యంలో బలంగా ఉంది కాబట్టి, SBI ఛైర్మన్ అయిన తర్వాత, ప్రధానంగా బ్యాంక్ బాడ్ లోన్ రికవరీపై చల్లా శ్రీనివాసులు శెట్టి దృష్టి పెట్టవచ్చు.
మీడియా కథనాల ప్రకారం, ఎస్‌బీఐ ఛైర్మన్ రేసులో అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న విషయంలో, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది.
మరో ఆసక్తికర కథనం: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం