Gold Price At Record High: అతి ప్రేమ అనర్ధదాయకం అంటారు. మనుషులకే కాదు, బంగారానికీ ఇది వర్తిస్తుంది. భారతీయులు, ముఖ్యంగా అతివలు అత్యంత ఇష్టపడే పుత్తడి ఇప్పుడు కష్టపెడుతోంది. ప్రస్తుతం, స్వర్ణం ధర రికార్డ్‌ స్థాయిలో చిటారుకొమ్మన మిఠాయి పొట్లంలా మారింది. అంత ఎత్తుకు ఎగిరే ధైర్యం, ఓపిక సాధారణ జనం దగ్గర లేవు.
 
ఈ రోజు (మంగళవారం, 16 ఏప్రిల్ 2024‌) దిల్లీ బులియన్ మార్కెట్‌లో, 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ. రూ.74,130 స్థాయిలో ఉంది. ఈ రోజు 10 గ్రాముల పసిడి రేటు (24 క్యారెట్లు) రూ. 980 జంప్‌ చేసింది. పన్నులేవీ కలపకుండా ఉన్న రేటు ఇది. టాక్స్‌లు కూడా కలుపుకుని 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు రూ. 75,300గా (Gold Prices At Record High) కొనసాగుతోంది. 


ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2,400 డాలర్ల వద్ద ఉంది. 


ఈ రోజు వెండి ధర అమాంతం కూడా కిలోకు రూ. 1,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండిని రూ. 86,050 చొప్పున అమ్ముతున్నారు, ఇది అండర్‌ సేల్‌. అంటే.. వాస్తవ ధర కన్నా తగ్గించి ఇస్తున్నారు. ప్రజలు పసిడిని కొనలేక వెండి ఆభరణాల వైపు చూస్తున్నారు. సిల్వర్‌ రేట్‌ మెరుపులకు ఇది కూడా ఒక కారణం.


అప్పుడు 102 రూపాయలు - ఇప్పుడు రూ.75,300


57 సంవత్సరాల క్రితం, 1967లో, 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర 102 రూపాయలుగా ఉంది. అప్పట్లో కూడా దీనిని ఎక్కువ రేటు అనుకున్నారట జనం. ఆ తర్వాత... 1973లో 278 రూపాయలకు, 1977లో 486 రూపాయలకు, 1980లో 1,330 రూపాయలకు, 1985లో 2,130 రూపాయలకు పెరిగింది.


క్యాలెండర్‌లో 1990 సంవత్సరం కనిపించే సరికి, 10 గ్రాముల ప్యూర్‌ గోల్డ్‌ రేట్‌ 3,200 రూపాయలకు చేరింది. 1995లో 4,680 రూపాయలకు ఎగబాకింది. 2000లో ఇది 4,400 రూపాయలకు, 2007లో 10,800 రూపాయలకు, 2011లో 26,400 రూపాయలకు, 2018లో 31,438 రూపాయలకు జంప్‌ చేసింది.


గత ఐదేళ్లలోనే 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రెట్టింపు పైగా పెరిగింది. 2019లో 35,220 రూపాయలుగా ఉంటే, ఇప్పుడు 75,300 రూపాయలకు చేరింది. అంటే, సరిగ్గా ఐదేళ్ల క్రితం 10 గ్రాములు బంగారం కొన్న డబ్బుకు ఇప్పుడు 5 గ్రాములు మాత్రమే వస్తుంది. ఈ రేటు 2020లో 48,651 రూపాయలుగా, 2022లో 52,670 రూపాయలుగా, 2023లో 65,330 రూపాయలుగా ఉంది.


బంగారాన్ని సేఫ్‌ హెవెన్‌గా (Safe Haven) చూస్తారు. సంక్షోభ సమయాల్లో పెట్టుబడులకు రక్షణ కల్పించే పెట్టుబడి సాధనం ఇది. ప్రస్తుతం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటున్నాయి. గత ఏడాది, చైనా కేంద్ర బ్యాంక్‌ 225 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి, తన పసిడి నిల్వలను 2200 టన్నులకు పైగా పెంచుకుందని సమాచారం. పోలండ్‌ 130 టన్నులు, సింగపూర్‌ 77 టన్నుల బంగారాన్ని కూడగట్టాయని తెలుస్తోంది. మన రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా తక్కువేమీ కాదు. RBI, ఇటీవలి కొన్ని నెలల్లో 13 టన్నుల గోల్డ్‌ కొనుగోలు చేసింది. దీంతో, ఈ ఏడాది జనవరిలో మొత్తం నిల్వలు 800 టన్నులకు చేరాయి. అమెరికన్‌ కేంద్ర బ్యాంక్‌ యూఎస్‌ ఫెడ్‌, తన వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉంది. ఈ కారణాల వల్ల అంతర్జాతీయంగా ఎల్లో మెటల్‌కు డిమాండ్‌ పెరిగింది, ఆ ప్రభావం భారతీయ మార్కెట్‌పైనా పడింది.


మరో ఆసక్తికర కథనం: దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ - ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌