Gold Price At Record High: బంగారం ధర ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది, పాత రికార్డును బద్ధలు కొడుతోంది. శుక్రవారం (12 ఏప్రిల్ 2024‌) దిల్లీ బులియన్ మార్కెట్‌లో, 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ. 73,000 స్థాయిని దాటింది, రికార్డు గరిష్టానికి చేరింది. 


10 గ్రాముల పసిడి రేటు శుక్రవారం ఒక్క రోజే రూ. 1,050 జంప్‌తో రూ.73,350కు (Today's Gold rate) చేరుకుంది. ఇది టాక్స్‌లు లేకుండా ఉన్న లెక్క. అన్ని పన్నులు కలుపుకుని 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు శుక్రవారం సాయంత్రానికి రూ. 75,550గా ‍‌(Gold Prices At Record High) నమోదైంది. MCX ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో, బంగారం 10 గ్రాములకు గరిష్ట స్థాయి రూ. 72,828కి చేరుకుంది.


స్వర్ణమే కాదు రజతం కూడా ఇదే జోరును కొనసాగిస్తోంది. శుక్రవారం, వెండి ధర అమాంతం రూ. 1,400 పెరిగి కొత్త రికార్డు గరిష్ట స్థాయి రూ. 86,300కి చేరుకుంది. 


బంగారం ధరలు పెరగడానికి కారణమేంటి?
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకు కొత్త రికార్డ్‌లు సృష్టించడానికి అంతర్జాతీయ మార్కెట్లే కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2,400 డాలర్ల మార్కును దాటింది, 2,422 వద్ద డాలర్ల ట్రేడవుతోంది. 


బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా (Safe Haven) పరిగణిస్తారు. ప్రపంచంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు వంటివి తలెత్తినప్పుడు, అమెరికా వంటి ప్రపంచ ప్రధాన మార్కెట్లలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.. పెట్టుబడిదార్లకు బంగారం భరోసా కల్పిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు తమ డబ్బును పుత్తడిలోకి మళ్లిస్తుంటారు. ఇప్పుడు... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, సిరియాలోని తన రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఈ కారణంగా ఎల్లో మెటల్‌ (బంగారం) డిమాండ్ పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి. త్వరలో... యూకే, జర్మనీ, చైనా వంటి దేశాల నుంచి వెలువడే ఆర్థిక గణాంకాలు కూడా పసిడి రేట్లను ప్రభావితం చేస్తాయి. 


గోల్డ్‌ షాపింగ్‌లు వాయిదా
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో నగల దుకాణాల వైపు వెళ్లడానికి కూడా సామాన్యులు భయపడుతున్నారు. పుత్తడి కొనాలనుకుంటున్న వాళ్లు బంగారం ధర తగ్గకపోతుందా అని ఎదురు చూస్తున్నారు, షాపింగ్‌ వాయిదా వేస్తున్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ అనాసక్తిపై వర్తకులు ఆందోళన ఉన్నారు. గోల్డ్‌ రేట్లు పెరగడం వల్ల ఆభరణాలకు డిమాండ్ తగ్గిందని, గోల్డ్‌ షాపుల వైపు వచ్చే వాళ్ల సంఖ్య పడిపోయిందని ఆభరణాల రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ చెప్పింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జ్యువెలరీ సేల్స్‌ 15 నుంచి 20 శాతం క్షీణించాయని, దానిని భర్తీ చేయలేమని ఈ కంపెనీ తెలిపింది. గత 30 రోజుల్లో బంగారం ధరలు 10 శాతం పెరిగాయని, గత ఆరు నెలల్లో 25 వరకు జంప్‌ చేశాయని సెన్కో గోల్డ్ ఎండీ & సీఈవో సువెంకర్ సేన్ చెప్పారు. ఆభరణాల రిటైల్ కొనుగోలుపై ప్రభావం పడిందన్నారు.


మరో ఆసక్తికర కథనం: హమ్మయ్య, 5 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం - కలవరపెడుతున్న ఆ ఒక్క విషయం