శంఖం సముద్రం నుంచి పుట్టింది. సముద్ర మథన సమయంలో 14 రత్నాలు, లక్ష్మీ దేవితో ఇతరాలతో పాటు శంఖం కూడా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ తోబుట్టువుగా శంఖాన్ని అభివర్ణిస్తారు. ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్మకం. సముద్రమథన సమయంలో సముద్రం నుంచి 14 రత్నాలు ఉద్భవించాయి. వీటిలో లక్ష్మీదేవి కూడా ఉంది. లక్ష్మీదేవి మాదిరిగానే శంఖం కూడా సముద్రం నుంచి ఉద్భవించింది కనుక ఇది చాలా పవిత్రమైంది. ఇంట్లో శంఖం ఉంటే సంపదకు కొదవ ఉండదట. పూజలు, ఇతర పవిత్ర కార్యక్రమాల్లో శంఖాన్ని పూరించడం వల్ల పర్యావరణ శుద్ధి కూడా జరుగుతుందట. ఇంట్లో పాజిటివ్ తరంగాలు వ్యాపించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. వాస్తు కూడా ఇంట్లో శంఖం ఉండడం వల్ల పాజిటివిటి పెరుగుతుందని చెబుతోంది. అయితే శంఖం పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలన్ని పొందాలంటే మాత్రం నియమాలు పాటించాలట. ఆ నియమాలేమిటో, ఎందుకు శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.


పూజగదిలో మాత్రమే


శంఖాన్ని ఎల్లప్పుడు పూజ గదిలో మాత్రమ ఉంచాలి. పూజ గది ఇంట్లోని అన్ని ప్రదేశాల్లోకెల్లా శుభ్రంగా ఉంటుంది. శంఖం ఎప్పుడూ శుభ్రమైన స్థానంలో ఉండడం ముఖ్యం. పూజగదిలో దేవుడి సమక్షంలో శంఖాన్ని పెట్టుకోవాలి. శంఖాన్ని పెట్టేందుకు ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని ఉపయోగించాలి. వస్త్రంలో దాన్ని పూర్తిగా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే శంఖంలో దుమ్ము చేరకుండా ఉంటుంది. దుమ్ము చేరకుండా ఉన్నపుడు శంఖం దాని పవిత్రతను కోల్పోకుండా ఉంటుంది. పూజలో ఉంచకూడదని అనుకుంటే పూజాసామగ్రితో పాటు భద్రపరుచుకోవచ్చు.


శుధ్ధిచెయ్యాలి


శంఖాన్ని పూజ ప్రారంభానికి ముందు, పూజ తర్వాత ఎప్పుడు పూరించినా సరే తర్వాత శంఖాన్ని శుద్ధి చేయ్యాలి. శంఖాన్ని పూరించిన తర్వాత నీళ్లు, గంగాజలం రెండూ కలపాలి. ఇందులో శంఖాన్ని ఉంచి కడగాలి తర్వాత నీళ్లలో నుంచి శంఖాన్ని బయటకు తీసి శుభ్రమైన వస్త్రంతో దాన్ని పూర్తిగా తుడిచి ఆరిన తర్వాత తిరిగి శంఖాన్ని యథా స్థానంలో ఉంచుకోవచ్చు. ఇది శంఖం పూరించిన ప్రతి సారీ చెయ్యాలి.


నేల మీద పెట్టకూడదు


శంఖాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. ఇది శంఖాన్ని అవమానించినట్లవుతుంది. ఎల్లప్పుడు శంఖాన్ని వస్త్రం మీద ఉంచాలి. శుధ్ది చేసినా సరే నీటిలో నుంచి తీసి గుడ్డ చుట్టి శుభ్రం చెయ్యాలి.


శంఖం ముఖం ఎల్లప్పుడు పై వైపు ఉండేట్టుగా ఉంచాలి. శంఖాన్ని నీటితో నింపి ఉంచకూడదు. శంఖం ఖాళీగా ఉన్నపుడే దాని నుంచి శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది. లక్ష్మీ, విష్ణు లేదా కృష్ణుడి పాదాల దగ్గర ఉంచడం మంచిది.


శంఖాన్ని ఇంట్లో తూర్పు దిక్కున పెట్టుకోవాలి. తూర్పులో వీలుకాకపోతే వాయవ్యంలో కూడా పెట్టుకోవచ్చు.


పూజానంతరం గంగాజలాన్ని శంఖంలో నింపి ఆ నీటిని ఇల్లంతా చిలకరించాలి. ఈ చర్య ఇంటి నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. అప్పుల బెడద తీరి ఇంట్లో సంపద చేరుతుంది.


కారణం లేకుండా శంఖాన్ని పూరించకూడదు. పూజకు ముందు, పూజ తర్వాత మాత్రమే శంఖాన్ని పూరించాలి. శంఖ ధ్వని వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులను చంపుతుంది. పర్యావరణం శుద్ధి అవుతుంది.


Also Read : Vastu Tips in Telugu: ఇంట్లో ఈ రంగులు అస్సలు వేయొద్దు - వాస్తు దోషంతో కష్టాలు వెంటాడుతాయ్!




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.