రంగులన్నీ అందమైనవే. ఒక్కోరంగు ఒక్కో భావాన్ని కలిగిస్తుంది. అయితే కొన్ని రంగులు స్తబ్దుగానూ మరికొన్ని శక్తిహీనంగానూ ఇంకొన్ని అత్యుత్సాహంగానూ అనిపిస్తాయి. కొన్ని రంగులు శక్తి ప్రసారానికి అనుకూలంగా ఉంటే మరి కొన్ని రంగులు శక్తి ప్రసారానికి అడ్డుతగులుతాయి. కొన్ని రంగులు ఎక్కువ వాడితే ప్రతికూల శక్తుల ప్రసారానికి అనుకూల పరిస్థితులు కలిగిస్తాయి. అవేమిటో? వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫెంగ్ షూయి ఏం వివరిస్తుందో తెలుసుకుందాం.


ఫెంగ్ షూయి చైనీస్ వాస్తు. ఇది ఇంట్లో సామరస్యతను పెంచే విధానాలను వివరిస్తుంది. ఫెంగ్ షూయి ప్రకారం కొన్ని రంగులు అంత అదృష్టకారాకాలు కావు. ఇవి ఎక్కువ ఉపయోగిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెబుతోంది. ఈ రంగులు విశ్వంలో సమతుల్యతను భంగపరుస్తాయని నమ్మకం. ఈ రంగులు ఇంట్లో వినియోగించినపుడు ఇంటిలో సమతుల్యత దెబ్బతింటుందని వాస్తు సూచిస్తోంది. ఈ రంగులు శక్తి ప్రవాహాన్ని స్థంభింపజేయడం వల్ల వీటిని అశుభంగా భావిస్తారు. ఎలాంటి రంగులు ఇంట్లో ఇంబందికరమో తెలుసుకుందాం.


నలుపు


ఫెంగ్ షూయి నలుపును మంచి రంగుగా భావించదు. నలుపు ఎప్పుడూ మిస్టీరియస్ రంగే. నలుపు రహస్యానికి, ఆత్మపరిశీలనకు సంకేతం. నలుపు రంగు ఎక్కువగా కనిపిస్తే ఆ ప్రదేశం స్తబ్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నలుపు రంగును ఇంట్లో వీలైనంత తక్కువ వాడడం మంచది. కొందరికి నలుపు ఇష్టమైందిగా ఉంటుంది. కానీ నలుపు రంగు చీకటికి సంకేతం. లివింగ్ రూమ్ ముదురురంగుల్లో ఉండాలని అనుకుంటే బ్రౌన్, చాక్లేట్ వంటి ఇతర ఆప్షన్లు ఎంచుకోవడం మంచిది.


తెలుపు


తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. తెలుపు ఎక్కువ వాడితే ఆ పరిసరాలు చల్లగా శక్తి రహితంగా అనిపిస్తాయి. ఫెంగ్ షూయి ఎనర్జీ బ్యాలెన్సింగ్ గురించి వివరిస్తుంది. ఇలా చల్లగా, ఖాళీ భావన కలిగించే తెలుపు ఆందోళన పెంచుతుందని ఫెంగ్ షూయి ఉద్దేశం. బాత్రూమ్ లేదా వంటగదిలో ఈ రంగు వాడితే ఫర్వాలేదు కానీ డైనింగ్ లేదా పిల్లల గదుల్లో ఈ రంగు అంత మంచిది కాదు. 


ఎరుపు


ఎరుపు అదృష్టానికి సంకేతం. ఎరుపు అధృష్టానికి, శక్తి ప్రవాహానికి, విజయానికి ప్రతీక. ఉత్తేజ పరిచే రంగు. ఎరుపు ఎక్కువగా కనిపించినపుడు చంచలంగా ఉంటుంది. అతి చురుకుగా, దూకుడు తనాన్ని పరిసరాలకు ఆపాదిస్తుంది. కొన్ని సార్లు ఇలాంటి వాతావరణం ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. డైనింగ్, ఆఫీస్, వంటగది, పిల్లలగది, పడక గదులకు ఎరుపు రంగు అంత మంచిది కాదు. పడకగదిలో ఎరుపు దంపతుల మధ్య సంబంధాలను దెబ్బతీయవచ్చు. కోపం పెరిగిపోయి కుటుంబ సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తూర్పు, పడమరల వైపు ఉన్న తలుపులకు ఎరుపు రంగు వెయ్యొద్దని ఫెంగ్ షూయి సూచిస్తోంది.


Also Read : Lucky Bamboo: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అదృష్టం తెస్తుందా?



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.