శనివారం శనీశ్చరునికి ప్రీతిపాత్రమైన రోజు. శని కటాక్షం అంత త్వరగా దొరకదు. ఒకసారి దొరికితే ఇక వారికి తిరుగుండదు. శని అనుగ్రహం ఉన్నవారికి ఇహలోకంలోని అన్ని రకాల ఆనందాలు, విజయాలు సొంతమవుతాయని నమ్మకం.   


జ్యోతిషంలో శనిని కర్మ కారకుడిగా చెబుతారు. వ్యక్తుల కర్మానుసారం వారికి ఫలితాలను ఇస్తాడని ప్రతీతి. శని గ్రహాన్ని క్రూరగ్రహం గా కూడా అభివర్ణిస్తారు. పద్ధతిగా జీవితాన్ని గడపని వారి విషయంలో శని చాలా కఠినంగా వ్యవహరిస్తాడని కూడా జ్యోతిష్యం చెబుతోంది. వీరు జీవితంలో అనుభవించని కష్టాలు ఉండవట. అందుకే జీవితంలో సత్కార్యాలు చేయ్యాలని చెబుతున్నారు. అందుకే నీతి నియమాలతో జీవించాలని చెబుతారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితాన్ని అనుభవించక తప్పదు.


ఏలినాటి శని, అష్టమ శని వంటి దీర్ఘకాలిక శని ప్రభావం కలిగించే పరిస్థితులు. ఈ సమయాల్లో శని అనుగ్రహం లేక పోవడం వల్ల ఎలాంటి పనులు పూర్తికావు. ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు బాధపెడుతుంటాయి. అయితే శని అనుగ్రహం పొందితే మాత్రం ఈ సమయాన్ని కూడా సునాయసంగా బయటపడేందుకు మార్గాలు దొరుకుతాయి.


శని దోషం ప్రభావం తగ్గాలంటే కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకుని పూజచేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. జ్యోతిషం ఎలాంటి శని శాంతికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదో తెలుసుకుందాం.


శని యంత్రం


శని అనుగ్రహం కావాలంటే ఇంట్లో శని యంత్రాన్ని ఇంట్లో పూజలో పెట్టుకుని ప్రతి రోజూ పూజించాలి. ఇలా చేస్తే శని సంతుష్టుడై  సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తాడు.


శని చాలీసా


ఇంట్లో శని చాలిసా పుస్తకం తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత ఈ చాలీసా పారాయణం చెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే శని అనుగ్రహం లభిస్తుంది.


నీలం


శనికి ఇష్టమైన రత్నం నీలం. నీలం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ధరించే ముందు పండితుల సలహా తప్పక తీసుకోవాలి. నీలం జాతాకాన్ని అనుసరించి ఎవరికి ప్రభావవంతమో పండితులను అడిగి తెలుసుకుని తర్వాత ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నీలం సూటయ్యే వారికి దానితో చాలా లాభం ఉంటుంది.


హనుమాన్ విగ్రహం


ఇంట్లో పూజలో హనుమాన్ విగ్రహం పెట్టి అనునిత్యం పూజించే వారికి ఎంతటి శని దోషమైనా సరే పెద్దగా బాధించకుండా శని కాలం గడిచి పోతుంది. ఎందుకంటే హనుమంతుడిని పూజించే వారిని ఎప్పుడూ బాధించనని శనిశ్చరుడు హనుమాన్ కి వాగ్ధానం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.


శివ పూజ


నిత్యం శివ పూజ జరిగే ఇంట్లో కూడా శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శనీశ్చరునికి సాక్షాత్తు ఆ పరమ శివుడే గురువు. ఆయనను పూజించినపుడ అపార గురు భక్తి కలిగిన శనిశ్చరుడు సంతుష్టుడవుతాడు. అందువల్ల నిత్యం శివపూజ చేసేవారికి శని అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుంది.


శమీవృక్షం


ఇంటి ఆవరణలో శమీవృక్షం ఉంటే ఆ ఇంట్లో శని దేవుడు కొలువై ఉంటాడని నమ్మకం. ప్రతి శనివారం శమీ వృక్షానికి దీపం వెలిగించి పూజించే ఇంట్లో శని అనుగ్రహం అపారంగా లభిస్తుంది. ఆ ఇంటిని సంపద ఎప్పటికి వీడి పోదు.  


Also Read : Meenakshi Devi: మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహానికి మూడు స్తనాలు ఎందుకుంటాయో తెలుసా?






Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.