మధుర మీనాక్షి ఆలయం దేశంలోని విశిష్ట ఆలయాల్లో ప్రత్యేకమైంది. మధురై తమిళనాడులో ఉంది. దక్షిణ భారత దేశంలోని పురాతన ఆలయాల్లో ఇదొకటి. అతి పురాతన చరిత్ర, స్థల పురాణం కలిగిన ఆలయం ఇది. దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ ఆలయ సందర్శన కోసం వస్తుంటారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు కూడా. దాదాపుగా 2500 సంవత్సరాల పురాతనమైందిగా చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణ వైశిష్ట్యంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా ప్రత్యేకమైందే. అమ్మవారి విగ్రహానికి మూడు స్తనాలు ఉంటాయి. దీని వెనుక నిగూఢ రహస్యం ఉందట.
మధుర మీనాక్షి ఆలయ ప్రాశస్త్యం
మధుర మీనాక్షి ఆలయం నిర్మాణం దాదాపు 2500 సంవత్సరాలకు పూర్వం జరిగినట్టు చరిత్రకారుల అంచన. ఇక ఆలయ గర్భగుడి మరింత పురాతనమైనదిగా చెబుతున్నారు. ఈ గర్భగుడికి దాదాపు 3500 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చని అంటున్నారు. గర్భగుడి చుట్టూ కట్టిన ప్రాకారాలు, ఇతర ఆలయ సముదాయాలు దాదాపుగా 1500 -2000 సంవత్సరాల పురాతనమైనవి.
ఇక్కడి ఆలయంలో మీనాక్షి అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు కూడా కొలువై ఉంటాడు. ఆలయంలో 12 అద్భుతమైన గోపురాలు ఉంటాయి. వీటి మీద అందమైన శిల్పాలు చెక్కి ఉంటాయి. ఎనిమిది స్థంభాల మీద ఆలయం నిర్మించబడింది. వాటిమీద అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. ఈ స్థంభాల మీద శివపురాణ గాథలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడి ఆలయ సముదాయాల్లో వినాయకుడి గుడి కూడా ఉంటుంది.
రెండు ముఖ్య ఆలయాలు
మీనాక్షి ఆలయ సముదాయాల్లో రెండు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. మొదటిది ప్రధాన ఆలయమైన మీనాక్షి దేవి ఆలయం. ఇందులో అమ్మవారి ఒక చేతిలో చిలుక, మరోచేతిలో చిన్న చుర కత్తి ఉంటాయి. ఈ ఆలయ గోడల మీద కళ్యాణ ఉత్సవం చిత్రించి ఉంటుంది. ఇక రెండవ ముఖ్య ఆలయం శివుని అవతారమైన సుందరేశ్వర దేవుడిది. ఇక్కడి అమ్మవారికి ఈ స్వామితో కల్యాణం జరిపిస్తారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ప్రతి రాత్రి సుందరేశ్వరుడు అమ్మవారి కోసం మీనాక్షి గర్భ గుడిలోకి వెళ్తారని, అక్కడ వారు ఏకాంతంగా గడుపుతారని విశ్వాసం. ఆ సమయంలో వారిని ఎవరూ ఆటంకపరచరు.
చరిత్ర
మదురై రాజు మలయధ్వజ పాండ్య సతీసమేతంగా పుత్ర సంతానం కోసం యజ్ఞం చేశారు. ఈ యాగం ద్వారా ఆయనకు మూడేళ్ల వయసు కలిగిన కుమార్తె జన్మించింది. ఆమె కళ్లు చేపల వలె పెద్దగా ఉన్నాయి. అందువల్ల ఆ దంపతులు తమ కుమార్తెకు మీనాక్షి అని పేరు పెట్టారు. ఆమెకు మీనాల వంటి కన్నులు మాత్రమే కాదు మూడు స్తనాలు కూడా ఉన్నాయి. అది చూసి రాజదంపతులు దిగులు పడ్డారు. శివ భక్తుడైన రాజు దిగులును పోగొట్టేందుకు మహా శివుడు కలలో కనిపించి ఆమెకు తగిన వరుడు దొరికినపుడు అదనంగా ఉన్న స్తనం దానంతట అదే మాయం అవుతుందని చెప్పాడు. అతి ధైర్యవంతురాలైన ఆమె రాజ్యపాలన కూడా చేస్తుందని శివుడు రాజుకు తెలియజేశాడు.
ఇలా సాక్షాత్తు శివుడి అంశతో జన్మించిన మీనాక్షి దేవి తర్వాత కాలంలో చాలా యుధ్దాలు చేసింది. తన రాజ్యాన్ని అత్యంత రంజకంగా పాలించింది. సుందరేశ్వరుడిని పెళ్లి చేసుకుంది.
Also read : Rudraksha Rules in Telugu: రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.