LSG vs DC IPL2024 Delhi Capitals won by 6 wkts:  ఐపీఎల్‌(IPL)లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSH)కు ఢిల్లీ(DC) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.  వరుసగా మూడు విజయాలతో మంచి ఊపు మీదున్న లక్నోకు పంత్‌ సేన ఝులక్‌ ఇచ్చింది. తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి సాధికార విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఇచ్చిన షాక్‌తో.. లక్నో విజయాలకు బ్రేక్‌ పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

 

కట్టుదిట్టంగా బౌలింగ్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఆరంభంలో లక్నో ఓపెనర్లు ధాటిగానే అడారు. 3 ఓవర్లలో 28 పరుగులు జోడించారు. క్వింటన్‌ డికాక్‌ను అవుట్‌ చేసి లక్నో పతనాన్ని ఖలీల్‌ అహ్మద్‌ ఆరంభించాడు. 13 బంతుల్లో నాలుగు ఫోర్లతో 19 పరుగులు చేసి డికాక్‌ అవుటయ్యాడు. దేవదత్‌ పడిక్కల్‌ను కూడా ఖలీల్‌ అహ్మద్‌ అవుట్‌ చేయడంతో 41 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. డికాక్‌, పడిక్కల్‌ అవుటైనా క్రీజులో ఉన్నంతసేపు లక్నో సారధి రాహుల్ ధాటిగానే ఆడాడు. 22 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసిన రాహుల్‌ను... కుల్‌దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత స్టోయినీస్‌ ఎనిమిది, నికోలస్‌ పూరన్‌ సున్నా... దీపక్‌ హుడా పది పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు. ఒకే ఓవర్లో స్టోయినిస్‌, పూరన్‌ను అవుట్‌ చేసిన కుల్‌దీప్‌ యాదవ్‌ లక్నోను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నపూరన్‌ను అద్భుత బంతితో బౌల్డ్‌ చేసిన బంతిని చూసి తీరాల్సిందే. వరుసగా వికెట్లు పడుతున్నా లక్నో బ్యాటర్‌ ఆయుష్ బదోని లక్నోను ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన బదోని అర్ధ శతకంతో లక్నోకు పోరాడే స్కోరును అందించాడు. 35 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో బదోని 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో అర్షద్‌ఖాన్‌ 16 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. బదోని పోరాటంతో   లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

 

సునాయసంగా లక్ష్య ఛేదన

168 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీకి పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు... పృథ్వీ షా-వార్నర్‌ 23 పరుగుల జోడించారు. ఎనిమిది పరుగులు చేసిన వార్నర్‌ను యశ్‌ ఠాకూర్ బౌల్డ్‌ చేసి లక్నోకు బ్రేక్‌ ఇచ్చాడు. కానీ పృథ్వీ షా, జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ ఢిల్లీని విజయం దిశగా నడిపించారు. రవి బిష్ణోయ్‌ వేసిన ఏడో ఓవర్‌లో 32 పరుగులు చేసిన పృథ్వీ ఔటయ్యాడు. పృథ్వీ అవుటైనా   మెక్‌గర్క్‌ ధాటిగా ఆడాడు. 13వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను ఢిల్లీ వైపునకు తిప్పేశాడు. కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో మెక్‌గర్క్‌ 55 పరుగులు చేసి నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఢిల్లీ వైపు పయనించింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా అప్పటికే లక్ష్యం కరిగిపోయింది. స్టబ్స్‌, హోప్స్‌ మిగిలిన పనిని పూర్తి చేశారు.