LSG vs DC IPL2024 delhi target 168 : ఐపీఎల్‌(IPL)లో లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు(DC) రాణించారు. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. కుల్‌దీప్‌ యాదవ్ తన స్పిన్‌ మాయాజాలంతో లక్నో బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్‌దీప్‌... మూడు వికెట్లు నేలకూల్చాడు. ఖలీల్‌ అహ్మద్‌ కూడా రెండు వికెట్లు నేలకూల్చాడు. లక్నో సారధి రాహుల్‌, ఆయుష్‌ బదోని 55 పరుగులతో రాణించడంతో లక్నో ఆ మాత్రం స్కోర్‌ అయినా చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో బదోని అర్ధ శతకంతో సత్తా చాటాడు. నలుగురు లక్నో బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.


కట్టుదిట్టంగా బౌలింగ్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఆరంభంలో లక్నో ఓపెనర్లు ధాటిగానే అడారు. 3 ఓవర్లలో 28 పరుగులు జోడించారు. క్వింటన్‌ డికాక్‌ను అవుట్‌ చేసి లక్నో పతనాన్ని ఖలీల్‌ అహ్మద్‌ ఆరంభించాడు. 13 బంతుల్లో నాలుగు ఫోర్లతో 19 పరుగులు చేసి క్వింటన్‌ డికాక్‌ అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవదత్‌ పడిక్కల్‌ను కూడా ఖలీల్‌ అహ్మద్‌ అవుట్‌ చేయడంతో 41 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. డికాక్‌, పడిక్కల్‌ అవుటైనా క్రీజులో ఉన్నంతసేపు లక్నో సారధి కె.ఎల్‌.రాహుల్ ధాటిగానే ఆడాడు. 22 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసిన రాహుల్‌ను... కుల్‌దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత స్టోయినీస్‌ ఎనిమిది పరుగులు, నికోలస్‌ పూరన్‌ సున్నా... దీపక్‌ హుడా పది పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు. ఒకే ఓవర్లో స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌ను అవుట్‌ చేసిన కుల్‌దీప్‌ యాదవ్‌ లక్నోను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నికోలస్‌ పూరన్‌ను అద్భుత బంతితో బౌల్డ్‌ చేసిన బంతిని చూసి తీరాల్సిందే. వరుసగా వికెట్లు పడుతున్నా లక్నో బ్యాటర్‌ ఆయుష్ బదోని లక్నోను ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన బదోని అర్ధ శతకంతో లక్నోకు పోరాడే స్కోరును అందించాడు. 35 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో బదోని 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కృణాల్‌ పాండ్యా మూడు పరుగులే చేసి అవుటయ్యాడు. బదోనికి అర్షద్‌ఖాన్‌ సహకారం అందించాడు. 16 బంతుల్లో 2 ఫోర్లతో అర్షద్‌ఖాన్‌ 20 పరుగులు చేశాడు. బదోని పోరాటంతో   లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది


హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌
    ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడుసార్లు తలపడ్డాయి. 
ఈ మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 2023 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో కైల్ మేయర్స్ 38 బంతుల్లో 73 పరుగులు చేయడంతో 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఢిల్లీని కేవలం 143 పరుగులకే పరిమితం చేసి ఘన విజయం సాధించింది.