Hardik Pandya About Jasprit Bumrah : వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB)పై ఘన విజయం సాధించడంపై ముంబై)MI) కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. విజయం ఎప్పుడూ బాగానే ఉంటుందని ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించిన బుమ్రాపై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా తమ వైపు ఉండడం చాలా అదృష్టమని.. బుమ్రా తన పనిని తాను సమర్థంగా పూర్తి చేస్తాడని హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తాము గెలిచిన విధానం కూడా చాలా ఆకట్టుకుంటుందని పాండ్యా అన్నాడు. రోహిత్‌ శర్మ- ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారన్న ముంబై కెప్టెన్‌ వాళ్లు వేసిన పునాదిపై తాము లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించామన్నాడు. జట్టుకు ఏం కావాలో ఆటగాళ్లందరికీ తెలుసని పాండ్యా తెలిపాడు.  బుమ్రా అనుభవం, విశ్వాసం అపారమని కొనియాడాడు.


 

విభిన్న నైపుణ్యాలు ఉండాల్సిందే: బుమ్రా

మ్యాచ్‌ ఫలితం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని బుమ్రా తెలిపాడు.  ఈ ఫార్మాట్‌లో బౌలింగ్‌ చాలా కష్టంగా ఉంటుందన్న బుమ్రా... కాబట్టి బౌలర్లు విభిన్న నైపుణ్యాలను కలిగి ఉండాలన్నాడు. బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రతి ఒక్కరూ రిసెర్చ్‌ చేస్తున్నారని... దానికి తగ్గట్లుగా బౌలర్లు సిద్ధం కావాలని తెలిపాడు. చెడ్డ రోజులు వచ్చినప్పుడు గతంలో బాగా బౌలింగ్‌ చేసిన వీడియోలు చూడాలని సూచించాడు. 

 

బుమ్రా వల్లే...

మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ నిర్వేదం వ్యక్తం చేశాడు.  టాస్ ఓడిపోవడం నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏదీ తదకు కలిసిరాలేదన్నాడు. తమ ఓటమిలో మంచు కీలకపాత్ర పోషించందన్నాడు. టాస్‌ గెలిచి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని డుప్లెసిస్‌ అన్నాడు. 250 పరుగులు చేయాల్సిన పిచ్‌పై 196 పరుగులు మాత్రమే చేయడంతో ఘోర పరాజయం తప్పలేదన్నాడు.  ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమన్న డుప్లెసిస్‌... మంచు కూడా తమ అవకాశాలను దెబ్బతీసిందని తెలిపాడు.  తాను, పటీదార్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా తమను బుమ్రా దారుణంగా దెబ్బతీశాడని డుప్లెసిస్‌ తెలిపాడు. ముంబై బౌలర్లు అద్భుతంగా పుంజుకు‌న్నారని బెంగళూరు కెప్టెన్ తెలిపాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడని... మలింగా మార్గనిర్దేశంలో బుమ్రా మరింత రాటుదేలాడని డుప్లెసిస్‌ తెలిపాడు. బుమ్రా లాంటి బౌలర్‌ తమ జట్టులో ఉంటే బాగుండేదని తెలిపాడు. తమ బౌలింగ్ బలహీనమనే విషయం తెలిసిందేనని... భారీ స్కోర్లు చేస్తేనే విజయాలు అందుకోగలుగుతామని బెంగళూరు కెప్టెన్‌ తెలిపాడు. 

 

మ్యాచ్‌ సాగిందిలా.,...

ఐపీఎల్‌లో  వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం... మూడే పరుగులు చేసి వెనుదిరిగాడు. బెంగళూరు సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పటిదార్‌, దినేశ్‌ కార్తీక్ అర్ధ శతకాలతో మెరిశారు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ రాణించగా... సూర్యకుమార్‌ యాదవ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. ఈ విజయం తర్వాత బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.