Gold Mutual Fund: బంగారం ధర చరిత్రాత్మక స్థాయిలో కొనసాగుతోంది. ఇది కొందరికి మోదం, మరికొందరికి ఖేదం. బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్లు పండగ చేసుకుంటుంటే, నగలు కొనే వాళ్లు ఘొల్లుమంటున్నారు. 


అంతర్జాతీయంగా & దేశీయంగా గత వారం కొత్త రికార్డ్‌ గరిష్ట స్థాయికి వెళ్లిన గోల్డ్‌ రేటు, ఆ తర్వాత కొద్దిగా చల్లబడింది. అయితే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేస్తోందన్న వార్తలు వెల్లువెత్తడంతో, ఎల్లో మెటల్ మెరుపు మరోసారి పెరిగింది. పశ్చిమాసియాలో రెండు అణ్వాయుధ దేశాల (ఇరాన్‌, ఇజ్రాయెల్‌) మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి, ప్రత్యక్ష యుద్ధానికి దిగాయన్న వార్తలు ప్రపంచాన్ని కుదిపేశాయి. పెట్టుబడిదార్లు పుత్తడి వెనుక పరుగులు పెట్టారు. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర మళ్లీ పతాక స్థాయికి చేరింది. 


యుద్ధ మేఘాల మధ్య పతాక స్థాయికి చేరిన పసిడి
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల వార్తల తర్వాత, ఈ రోజు (శుక్రవారం, 19 ఏప్రిల్‌ 2024) అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర మళ్లీ 2,400 డాలర్లకు చేరుకుంది. దేశీయ MCXలో, ఈ రోజు 10 గ్రాములకు రూ. 72,869 కు చేరుకుంది.


స్పాట్‌ గోల్డ్ విషయానికి వస్తే, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 కేరెట్లు) రేటు దాదాపు 76,000 రూపాయల వరకు వెళ్లింది. కిలో వెండి ధర 87,000 రూపాయలు పలుకుతోంది.


బంగారం పెట్టుబడిదార్లు ఫుల్‌ హ్యాపీస్‌
బంగారం ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకంగా 15 శాతానికి పైగా పెరిగింది. 2001 నుంచి 2011 వరకు, ఆ 10 సంవత్సరాల వెలుగును ఇప్పటి ర్యాలీ గుర్తు చేస్తోంది. ఆ 10 సంవత్సరాల్లోనే బంగారం ధర దాదాపు 650 శాతం పెరిగింది. గోల్డ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వాళ్లు ఈ ర్యాలీతో ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. పెరిగిన పెట్టుబడి విలువను చూసుకుని మురిసిపోతున్నారు.


బంగారం ధర పెరగడం వల్ల గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాభపడుతున్నాయి. గత 6 నెలల్లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సగటున 23 శాతం రాబడిని ఇచ్చాయి. SBI గోల్డ్ గత 6 నెలల్లో అత్యధికంగా 24.13 శాతం రిటర్న్‌ ఇచ్చింది. క్వాంటమ్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్ 23.74 శాతం రాబడితో రెండో స్థానంలో ఉంది. ఈ ఆరు నెలల కాలంలో 11 గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కనీసం 23 శాతం పైగా లాభాలను తీసుకొచ్చాయి.


గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అత్యంత తక్కువ రాబడి ఇచ్చిన ఫండ్‌.. DSP వరల్డ్ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF). ఇది గత 6 నెలల్లో 16.60 శాతం రాబడిని ఇచ్చింది. 20 శాతం కంటే తక్కువ రాబడిని ఇచ్చిన మరో ఫండ్ ఎడెల్వీస్ గోల్డ్ & సిల్వర్ ETF. ఈ రెండు తప్ప మిగిలిన ఫండ్స్‌ అన్నీ 20 శాతానికి పైగా లాభాలను అందించాయి.


దుబాయ్‌లో (Today's Gold Rate in Dubai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఈ రోజు రూ. 60,645.61 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,476.80 వద్ద ఉంది. UAE, షార్జా, అబుదాబిలోనూ ఇవే రేట్లు అమలవుతున్నాయి. మస్కట్‌లో ఆభరణాల స్వర్ణం ధర రూ. 62,458.85 గా ఉండగా, మేలిమి 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 65,820.35 గా నమోదైంది. 


మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్‌ కోసం అప్లై చేయడం ఇప్పుడు ఈజీ, బ్యాంక్‌ ఆ పనిని సింపుల్‌గా మార్చింది